తనకు తాను దేవుడి అంశగా చెప్పుకునే రాంపాల్ బాబా రెండు హత్యా కేసుల్లో దోషిగా తేలారు. మొత్తం ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి మృతికి సంబంధించి నమోదైన రెండు కేసులలోనూ రాంపాల్ బాబానే దోషీ అని హిసార్ కోర్టు తేల్చింది. హర్యానాలోని హిస్సార్ కోర్టు బాబాపై నమోదైన కేసులలో రెండు కేసుల విచారణను గురువారం చేపట్టింది. విచారణ అనంతరం రాంపాల్‌ను దోషిగా తేల్చినప్పటికీ.. ఈనెల 16, 17 తేదీల్లో శిక్ష ఖరారు చేయనున్నట్లు హిసార్ కోర్టు స్పష్టం చేసింది. డేరాబాబా గుర్మీత్ రామ్ రహీమ్ తరహాలోనే రాంపాల్ బాబాకు బర్వాలాలో సత్లాక్ ఆశ్రమం ఉంది. భారీ ఎత్తున శిష్యులను ఆయన సంపాదించుకున్నారు. 2014 నవంబర్‌లో ఆశ్రమంలోని ఓ శిష్యురాలు మృతిచెందగా బాబాపై హిసార్ లోని బర్వాలా పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు ఆదేశాల మేరకు రాంపాల్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లగా.. సత్లాక్ ఆశ్రమంలోని శిష్యులు వారిని అడ్డుకునేయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ ఘటనలో నలుగురు మహిళలు, ఓ చిన్నారి చనిపోయారు. ఈ ఘటనపై మరో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు రాంపాల్ బాబాను అరెస్ట్ చేసి హిసార్ సెంట్రల్ జైలుకు తరలించారు. హిసార్ జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్ధానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం కేసులను విచారించి, హత్యలకు కారకుడు బాబాయేనని కోర్టు భావించింది. అయితే తీర్పును వాయిదా వేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు హిసార్, ఆశ్రమం ఉన్న బర్వాలా ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 2017 ఆగస్టులో పోలీసుల విధులకు విఘాతం కల్పించారన్న కేసు, రాజద్రోహం సహా 5 కేసులలో రాంపాల్ బాబాపై నమోదైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.