ఉత్తరాంధ్రపై తిత్లీ తుఫాన్ పంజా విసిరింది. రాకాసి గాలులు, భారీ వర్షాలతో మూడు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. తుఫాన్ తీరం దాటినా.. పెను గాలులు వీస్తూనే ఉన్నాయి.. కుండపోతగా వానలు కురుస్తూనే ఉన్నాయి. ఈ తిత్లీ దెబ్బకు ఉత్తరాంధ్రలో 8మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మృతుల్లో ఐదుగురు శ్రీకాకుళం.. మరో ముగ్గురు విజయనగరం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. వీరిలో ఆరుగురు సముద్రంలో వేటకు వెళ్లి చనిపోగా.. ఒకరు ఇల్లు కూలి.. మరొకరు చెట్టు కూలడంతో చనిపోయారు. రాకాసి గాలుల దెబ్బకు మూడు జిల్లాల్లో చెట్లు, స్తంభాలు కూలిపోవడంతో.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రెండు జిల్లాల్లో దాదాపు 2వేలకు పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అక్కడక్కడా మొబైల్ సిగ్నల్స్ కూడా పనిచేయని పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడా రోడ్లు కూడా ధ్వంసంకావడంతో.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాంధ్రను వణికించిన 'తిత్లీ' తుపాను రెండు ప్రాణాలను బలిగొంది. గత రాత్రి నుంచి గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 20 సెంటీమీటర్లకు పైగానే వర్షం కురిసింది. ఇచ్చాపురంలో 23.7, కవిటిలో 12.4, మందసలో 13.2 నందిగామ్ లో 28, టెక్కలిలో 23.4, సంతబొమ్మాళిలో 24.4, కోటబొమ్మాళిలో 24.8, జాలమూరులో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.వేల ఎకరాల్లోని అరటి తోటలు భీకర గాలుల ధాటికి నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా కంబాలవలస, వీరఘట్టం మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాల ధాటికి రైల్వే ట్రాకులు దెబ్బతినడంతో యశ్వంత్ పూర్ - హౌరా ఎక్స్ ప్రెస్ (12864), బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ (12509), యశ్వంత్ పూర్ - ముజఫర్ పూర్ ఎక్స్ ప్రెస్ (15227) రైళ్లు రద్దయ్యాయి. పూరీ, విశాఖల మధ్య తిరిగే పలు పాసింజర్ రైళ్లను కూడా అధికారులు రద్దు చేశారు. విశాఖ - గుణుపూర్ పాసింజర్ ను విజయనగరం వరకు, విశాఖ - న్యూ పలాస పాసింజర్ ను విజయనగరం వరకూ మాత్రమే నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
విశాఖను భయపడుతున్న తితీలీ
తిత్లీ తుపాను తీరం దాటిన తరువాత, దాని ప్రభావం విశాఖ జిల్లాపైనా పడింది. విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తూ ఉండటం, ఆకాశం దట్టమైన మేఘాలతో నిండిపోవడంతో ఈ ఉదయం విశాఖ నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లాల్సిన ఇండిగో సర్వీసు రద్దయింది. దీంతో దాన్ని విశాఖలో అందుకోవాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో పడిగాపులు పడుతున్నారు. విశాఖ చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా సర్వీసు కూడా రద్దయింది. విమాన సర్వీసులను మధ్యాహ్నం వరకూ రద్దు చేశామని, ఆపై పరిస్థితిని సమీక్షించి సర్వీసులు పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు.
నేలకొరిగిన చెట్లు
తీరం దాటే వేళ తిత్లీ, పెనుగాలులు, భారీ వర్షంతో విరుచుకుపడింది. భారీ వృక్షాలు నేలరాలాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాగుల్లోకి భారీగా వరదనీరు రావడంతో, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా రహదారులపై ట్రాఫిక్ ను నిలిపివేసిన అధికారులు, పలు రైళ్లను నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. సాయంత్రం వరకూ తిత్లీ విధ్వంసం కొనసాగే అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఆ తరువాత మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే తిత్లీ, చత్తీస్ గడ్, తూర్పు తెలంగాణ వైపు కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.తిత్లీ ప్రభావం తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలపైనా కనిపించింది. కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో అలలు రోడ్డుపైకి ఎగసిపడుతుండగా, రహదారి ధ్వంసమైంది. రోడ్డు తెగిపోయి, సమీపంలోని ఇళ్లలోకి సముద్రపు నీరు చేరింది. దీంతో కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. సముద్రంలోకి చేపలవేటకు వెళ్లిన సంజీవరావు అనే మత్స్యకారుడు మరణించాడు