మహిళలపై వేధింపుల ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో బాధిత మహిళలకు మద్దతు పెరిగిపోతుండగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తీవ్ర విమర్శల పాలవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో మొదలైన వేధింపుల ఆరోపణల సెగ క్రీడాకారులకు తగులుతోంది. శ్రీలంక క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఎయిర్‌హోస్టెస్ సంచలన ఆరోపణలు కలకలం రేపిన మరుసటిరోజే మరో లంక క్రికెటర్ పేరు వెలుగుచూసింది. లసిత్ మలింగ లైంగిక వేధింపులకు సంబంధించి స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మలింగ చేతిలో వేధింపులకు గురైన ఓ బాధితురాలి మనోగతాన్ని చిన్మయి ట్వీట్ చేశారు. ఆమెకు మద్దతు తెలుపడంలో భాగంగా చిన్మయి మలింగ బాగోతాన్ని బయటపెట్టి ప్రకంపనలు రేపారు. ‘ముంబైలోని ఓ హోటల్‌లో ఆ ఘటన జరిగింది. కొన్నేళ్ల కిందట ఐపీఎల్ జరుగుతున్న సమయంలో హోటల్‌కు వెళ్లాను. లంక క్రికెటర్ లసిత్ మలింగ గదిలో నా స్నేహితురాలు ఉందని చెప్పారు. ఫ్రెండ్ కోసం వేచిచూస్తున్న నేను మలింగ గదికి వెళ్లగా అక్కడ ఆమె లేదు. మలింగ వెంటనే నన్ను బెడ్ మీదకు తోసేసి అసభ్యంగా తాకాడు. మలింగ నన్ను ఆక్రమించుకుంటుండగా అతడితో పోరాడలేక కళ్లు మూసుకున్నాను. ఇంతలో హోటల్ సిబ్బంది రావడంతో మలింగ వెళ్లి డోర్ తీశాడు. నేను వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లి ముఖం కడుక్కున్నాను. సిబ్బంది గదిలో ఉండగానే పరుగున అక్కడినుంచి బయటపడ్డాను. చాలా అవమానకర సంఘటన అది. ఈ విషయం ఎవరికైనా చెబితే.. నువ్వు ఉద్దేశపూర్వకంగానే మలింగ గదికి వెళ్లావు. అతడు చాలా ఫేమస్ కనుక నువ్వు కోరుకున్నది అదే అని’ నిందలు మోపుతారని బాధితురాలు గాయని చిన్మయికి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు. పేరు బహిర్గతం చేయవద్దని కోరినందుకు బాధితురాలి పేరు చెప్పడం లేదని చిన్మయి మరో ట్వీట్ చేశారు.