YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గంజాయి రవాణాకు అడ్డగా బెజవాడ

గంజాయి రవాణాకు అడ్డగా బెజవాడ
విజయవాడ గంజాయి రవాణాకు అడ్డాగా మారింది. ఇక్కడి నుంచి రూ.లక్షల్లో విలువ చేసే వందల కిలోల గంజాయి రైళ్ల ద్వారా తరలిపోతోంది. ఒడిశాలోని బరంపురంతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావారి, ఖమ్మం జిల్లాలోని మన్యం ప్రాంతాల నుంచి నిత్యం రైళ్లతో పాటు బస్సులు, కార్లలో రవాణా జరుగుతోంది. అయితే పోలీసులు పట్టుకున్న ప్రతిసారి చిన్న చేపలు మాత్రమే దొరకడం, పెద్ద చేపలు తప్పించుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. పట్టుబడ్డ వారంతా సామాన్యులే కావడం గమనార్హం. శ్రీకాకుళం నుంచి బాపట్ల, గుంటూరు వరకు విస్తరించిన రైల్వే పోలీసు డివిజన్‌లో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. 25న విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న 17.33 కిలోల గంజాయిని విజయవాడలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని రామవరప్పాడు వద్ద సెప్టెంబరు 30వ తేదీ విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న ఓ కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని డైరెక్టర్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. 132 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజధాని ప్రాంతమైన విజయవాడ కేంద్రంగా గంజాయి రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రైళ్లు, బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా నగరానికి తెచ్చే గంజాయి విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలో ఎక్కడికైనా చేరుకునేందుకు విజయవాడ నుంచి ఎప్పుడైనా రైలు సదుపాయం అందుబాటులో ఉండడం.. నగర శివారు ప్రాంతాల్లో అత్యధికంగా పేద, మధ్య తరగతి ప్రజలు నివసిస్తుండడం వల్ల గంజాయి అక్రమ రవాణాతో పాటు వినియోగం కూడా పెరుగుతోంది. అక్రమ రవాణా, విక్రయదారుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతోఈ విష సంస్కృతి పెరిగిపోవడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, విశాఖపట్నం జిల్లా మన్యం ప్రాంతాలతో పాటు తెలంగాణలోని ఇల్లందు ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గంజాయి నగరానికి వచ్చిచేరుతోంది. ఆయా ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు సరుకును నగరానికి తీసుకొచ్చి దళారులకు అప్పగించి వెళ్లిపోతుంటారు. అత్యంత రహస్యంగా బలిష్టమైన ప్యాకింగ్‌ చేసి వాసన కూడా బయటకు రాకుండా మిర్చీ మధ్యలోనూ కొరియర్‌ బాక్సుల్లో దీన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో తేవాలంటే మాత్రం కార్లు, లారీలు, బస్సులు వంటి వాహనాలను వినియోగిస్తున్నారు. గంజాయిని సూట్‌ కేసుల్లో, స్టీలు సంచుల్లో, మెడికల్‌ కిట్లలో రవాణా చేస్తున్నారు. వాసన రాకుండా పౌడర్‌ చల్లడం వల్ల ఎవరికీ అనుమానం ఉండదు. నగర ప్రవేశ మార్గాల్లో ఎటువంటి తనిఖీ కేంద్రాలు లేకపోవడం.. ఉన్నా అక్కడి వారు పట్టించుకోకపోవడంతో అక్రమ రవాణా సాగిపోతోంది. ఇక్కడి నుంచి కృష్ణా జిల్లాతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. 

Related Posts