విజయవాడ ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నారు. శుక్రవారం నాడు గాయత్రీ దేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇచ్చారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది.గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేదం పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.
శుక్రవారం ఉదయం మంత్రి పరిటాల సునీత అమ్మవారిని దర్శించుకున్నారు. తరువాత ఆమె మాట్లాడుతూ దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవటం ఇదే తొలిసారి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారని అన్నారు. అన్ని విధాలా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారు జీవం ఉట్టిపడే విధంగా ఉన్నారు. రాష్ట్రం అంత అమ్మవారి కృప వల్ల పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.