సిక్కోలు ప్రజలకు తీవ్ర ఆపద వచ్చింది. సహాయ పునరావాస చర్యలపై అందరూ కదలాలి. బాధిత ప్రజలకు సేవలు అందించడంలో పోటిబడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం అయన శ్రీకాకుళంలో తుపాన్ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీరు పేరు తెచ్చుకోవాలి. ప్రభుత్వానికి పేరు తేవాలి. ఎవరెవరు ఎలా పనిచేశారో విశ్లేషిస్తాం.బాగా పనిచేసిన వారికి అవార్డులిస్తాం.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు. టిట్లి తుపాన్ ఒక పెను విపత్తు, ప్రజలను ఆదుకునే సందర్భం. ప్రపంచం మొత్తం నా కోసం పనిచేయాలి. నేను మాత్రం ఎవరికీ పనిచేయను అనే పెడ ధోరణి మంచిది కాదని అన్నారు. అగ్నిమాపక శాఖ,మత్స్య శాఖ,నేవీ,డిజాస్టర్ మేనేజిమెంట్ సమన్వయంగా పనిచేయాలి. పర్యటనలో నావెంట ఎవరూ రావద్దు. ఎవరి ప్రాంతంలో వారు సేవలు అందించాలి. పెళ్లికి రాకపోయినా బాధపడం.కానీ బాధల్లో పరామర్శించకపోతే బాధపడతాం. మనందరం సామాన్య కుటుంబాలనుంచే వచ్చాం. మన కుటుంబాలకు ఈ ఆపద వస్తే ఎలా స్పందిస్తాం..? అదే స్ఫూర్తితో బాధితుల సేవల్లో పాల్గొనాలని సూచించారు. ఆపదల్లో అండగా ఉంటే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. నాయకుడికి సంక్షోభమే ఒక అవకాశం. సంక్షోభాలను ఎదుర్కొనే సామర్ద్యమే నాయకత్వం. ప్రతిఒక్కరూ ఈ నాయకత్వ లక్షణాన్ని అలవర్చుకోవాలి. ప్రజల కోసం మనం ఉన్నాం. సమాజంలో భాగంగా మనం ఉన్నాం. ఎంత తొందరగా సాధారణ స్థితి తెస్తారో పోటిబడాలి. మంత్రులు,ఎమ్మెల్యేలు,అధికారులకు ఇదే అవకాశం. యుద్ధప్రాతిపదికన గండ్లు పూడ్చాలి, రోడ్లకు మరమ్మతులు చేయాలి,కూలిన చెట్లను తొలగించాలని అన్నారు. ప్రతి మండలానికి ఒక సబ్ కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి.అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలి. ఎంత తొందరగా,ఎంత సులువుగా పనులు పూర్తి చేస్తారన్నదే ముఖ్యం. పంటనష్టం, ఆస్తినష్టంపై అంచనాలను రూపొందించాలని అన్నారు. మేన్ పవర్,మెటీరియల్ అన్నింటినీ రంగంలోకి దించాలి. ఇదొక అత్యవసర పరిస్థితి. దానికి తగ్గట్లుగా శరవేగంగా పనులు చేయాలి.విధి నిర్వహణపై అందరికీ స్పష్టత ఉండాలని అన్నారు.
రేపు ఆదివారం సెలవులేదు. కావాలంటే తరువాత సెలవు తీసుకోవాలి.సాధారణ స్థితులు సాధ్యమైనంత తొందరగా తేవాలి. అన్ని మండలాల్లో కమ్యూనికేషన్లు పునరుద్దరించాలి. సెల్ ఫోన్ టవర్లకు మరమ్మతులు పూర్తిచేయాలి. దెబ్బతిన్న కేబుల్స్ పునరుద్దరించాలి. సర్వీస్ ప్రొవైడర్లు అందరూ యుద్ధప్రాతిపదికన స్పందించాలని అన్నారు. శరవేగంగా పనులు ముమ్మరం చేయాలి. టిట్లి తుపాన్ కదలికలపై మన అంచనాలే నిజం అయ్యాయి. పొరుగు రాష్ట్రం కన్నా మనమే సరిగ్గా అంచనా వేశాం. ఎక్కడ ల్యాండ్ అవుతుందో స్పష్టంగా చెప్పగలిగాం. మన శాస్త్ర సాంకేతికతే అందుకు కారణం. విపత్తు రాకుండా అడ్డుకోలేం, కాని ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించగలమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు..