ఏపీలో గత 2014లో జరిగిన ఎన్నికలకు, రాబోయే 2019 ఎన్నికలకు మధ్య చాలా తేడా చోటుచేసుకోబోతోంది. గతసారి ఎన్నికల్లో పోటీ కేవలం రెండు పార్టీల మధ్యేనే నెలకొంది. టీడీపీ-వైసీపీలు మాత్రమే బరిలో ఉన్నాయి. అయితే, రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా మూడు ప్రాంతీయ పార్టీలైన టీడీపీ-వైసీపీ-జనసేన మధ్య హోరా హోరీ పోరు సాగనుందని స్పష్టమవుతోంది. దీనికితోడు పశ్చిమ గోదావరిలో జనసేన ప్రభావం అధికంగా ఉండనుందనే అంచనాలున్నాయి. దీంతో జనసేన ప్రభావం ఉన్న స్థానాల్లో టీడీపీ, వైసీపీ నేతలు కూడా తమ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం. ఇదిలావుండగా జిల్లాలోని కొవ్వూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం దక్కించుకున్న మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ఎన్నిఆటంకాలొచ్చినా, వచ్చే ఎన్నికల్లో తనదే గెలుపనే దీమాతో ఉన్నారని భోగట్టా. అదే సమయంలో తనకు అధిక మెజార్టీ వచ్చేలా స్థానిక నేతలో మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా పేరుగాంచింది. వరుసగా గతంలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధిస్తూవచ్చింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వైఎస్ ప్రభావం ఎంతగా ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలు టీడీపీని గెలిపించడం విశేషం. అలాగే 2009లోనూ కొవ్వూరు ప్రజలు మళ్లీ టీడీపీకే మద్దతు పలికారు.ఆనాటి ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేసిన టీడీపీ అభ్యర్థికి 15 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. 1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత ఇక్కడ 1999లో స్వల్ప ఓట్లతో ఓటమి ఎదుర్కొంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గత ఎన్నికలలో పోటీ చేసిన కేఎస్ జవహర్ కూడా 13 వేలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక, వచ్చే ఎన్నికల్లోనూ తన గెలుపు గ్యారెంటీ అని అయన చెబుతున్నారట. ఆయన హయాంలో నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి పనులు జరిగాయని స్థానికులు చెబుతుంటారు. దీనికితోడు కొవ్వూరు నియోజకవర్గానికి తొలిసారిగా మంత్రి పదవి జవహర్‌తోనే వచ్చిందనేది విదితమే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జవహర్… నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారని సమాచారం. ఈ క్రమంలోనే తనకు రాబోయే ఎన్నికల్లో 20 వేల పైచిలుకు ఓట్లు రావడం ఖాయమని ఆయన చెబుతున్నారట. దీనికితోడు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొవ్వూరులో ఆయనకు విజయం సాధించిపెడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రవేశంతో ముక్కోణపు పోటీ నెలకొననుందని తెలుస్తోంది. కాగా 2009లో ఇక్కడ ప్రజారాజ్యం ప్రభావం అంతగా కనిపించలేదు. అప్పటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి 15 వేల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. దీనికితోడు రాబోయే ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి విపక్ష వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా వెల్లడికాలేదు.