మీటూ ఉద్యమం అనేది లింగవివక్ష లేని ఉద్యమమని తనుశ్రీ దత్తా అభిప్రాయ పడ్డారు. కేవలం మహిళల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమం కాదని ఆమె పేర్కొన్నారు. మహిళలు తమపై లైంగిక వేధింపులు లేదా లైంగికదాడులు జరిపిన మగవారి బండారం బయటపెట్టి చట్టపరమైన శిక్షలు పడాలని, అలాగే తమకు రక్షణ కల్పించాలని బాధిత మహిళలు కోరుకోవడం ఆ ఉద్యమ లక్ష్యాలుగా కనిపిస్తాయని పేర్కొన్నారు. మగవారిని, పిల్లలను కూడా ఇందులో చేర్చాలని చెప్పారు. అసలు మనుషుల ఆలోచన మారాలని ఆమె అంటున్నారు. తనను వేధింపులకు గురిచేసినప్పుడు కనీసం 200మంది సెట్‌లో ఉండి ఉంటారని, వారెవరూ తనకు రక్షణగా ముందుకు రాకపోవడం దారుణమని అన్నారు. వీరు రేపు కోర్టుకు వచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్తారని ఆశించలేమని పెదవి విరిచారు. కోర్టులో పోరు అంత సులభం కాదని, ప్రత్యర్థులు బెదిరింపులు, బురదజల్లడం వంటివాటికి పాల్పడుతూనే ఉంటారని అన్నారు. ఆకతాయి వేధింపుదారుగా, వేధింపుదారు రేపిస్టుగా మారుతాడని హెచ్చరించారు. మొగ్గలోనే తుంచే ధోరణి సమాజానికి అలవడాలని సూచించారు.