అనంతపురంలోని, చిన్న పొలమడ గ్రామంలోని ప్రబోధానంద అరెస్టుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. రెండురోజుల క్రితం ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టీం ప్రబోధానంద అలియాస్ పెద్దన్న చౌదరిని అరెస్టు చేసేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. సెప్టెంబరు 15న వినాయక నిమజ్జనం సందర్భంగా హత్యతో పాటు విధ్వంసాలు, ఘర్షణలు చోటుచే సుకున్నాయి. వీటన్నింటికీ కారణం చేస్తూ త్రైత సిద్ధాంతకర్త ప్రబోధానందపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఆయనతో పాటు కుమారులైన యోగానంద చౌదరి, యుగంధర్‌చౌదరిలపై కూడా కేసు పెట్టారు. వీరిపై కేసు నమోదు చేసి దాదాపు నెల కావస్తున్నా అరెస్టులో జాప్యం జరుగుతూ వస్తోంది. గతంలో ప్రబోధానంద అరెస్టుపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పెద్దఎత్తున ఆందోళనకు దిగిన విషయం విదితమే. కాగా ప్రబోధానందతో పాటు ఆయన కుమారులను అరెస్టు చేసేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రబోధానంద భక్తులపై కూడా నిఘా ఉంచారు.విధ్వంసాల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రబోధానంద రెండు పర్యాయాలు సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడారు. ప్రబోధానందకు రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో భక్తులు ఉన్నారు. మరోవైపు ఇప్పటికే వివిధ కేసులకు సంబంధించి ప్రబోధానంద ఆశ్రమంలోని వందకు పైగా భక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరిలో కొందరిని పోలీస్ కస్టడీకి కూడా ప్రయత్నం చేశారు.ప్రబోధానంద ఆశ్రమంలోకి కొందరు భక్తులను పోలీసులు అనుమతించ లేదు. విశాఖపట్నం నుంచి వచ్చిన భక్తులు ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆదేశాల మేరకు ఆశ్రమంలోకి భక్తులను అనుమతించేది లేదని వారికి పోలీసులు తెలియచేశారు.