అన్నదాతను తిత్లీ తుపాను నిండా ముంచేసింది. గంటల వ్యవధిలో వెన్ను విరిచేసింది. అపార పంటనష్టం కలిగించి రైతన్నకు తీరని కడుపుకోత మిగిల్చింది. భీకర గాలులు, కుండపోతవర్షానికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క సిక్కోలులోనే 75 శాతం మేర వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. లక్షలాది కొబ్బరి చెట్లు నేలవాలాయి.వేలాది ఎకరాల్లోని అరటి, బొప్పాయి, జీడిమామిడి తోటలు నేలమట్టమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో రూ.1,350 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇందులో వరి నష్టమే అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.09 లక్షల హెక్టార్లలో వరి వేయగా.. 1.44 లక్షల హెక్టార్లకు పైగా పంట దెబ్బతింది. ఈ నష్టం విలువ రూ.875 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.వరి చేతికందే తరుణంలో హఠాత్తుగా వచ్చి పడిన తుపాను తమను కష్టాల పాల్జేసిందని సిక్కోలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 700 హెక్టార్లలోని అరటి తోటలు నేలకొరిగాయి. వీరఘట్టం, వంగర, రాజాం, జి.సిగడాం, గార మండలాల్లోని అరటి తోటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. 1,640 హెక్టార్లలోని జీడిమామిడి, 13 హెక్టార్లలోని బొప్పాయి, మరో 13 హెక్టార్లలోని కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని ఉద్యానవన శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక ఒక్క ఉద్దానం పరిసరాల్లోనే మూడు లక్షలకు పైగా కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం రూ.475 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. విజయనగరం జిల్లావ్యాప్తంగా అరటి, చెరకుతో పాటు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మొత్తం రూ.31.30 కోట్ల పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. 2,500 హెక్టార్లలో అరటి పంట నేలమట్టమైంది. 308 హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. అరటి తోటలు భారీగా నెలకొరిగాయి. అరటికి మంచి డిమాండ్ ఉన్న సమయంలో తోటలు నేలమట్టం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరి పంట.. కొమరాడలో 32.5 హెక్టార్లు, జియ్యమ్మవలసలో 44.8 హెక్టార్లు, మక్కువలో 2 హెక్టార్లు, చీపురుపల్లిలో 24 హెక్టార్లు, గరుగుబిల్లిలో 50 హెక్టార్లలో దెబ్బతింది. ఇక 106.1 హెక్టార్లలోని పత్తి పంట తుడిచి పెట్టుకుపోయింది.