క్యాప్షన్‌లో తప్పు ఏం లేదు. టీడీపీ స్టార్ క్యాంపెయినర్ వచ్చే ఎన్నికల్లో నిజంగా మోడీయే! ప్రస్తుతం ఇది ఏపీ ప్రజల్లో ఉన్న అభిప్రాయానికి ప్రతిరూపం. ఇది పూర్తిగా అర్థం కావాలంటే కొన్ని పాత విషయాలు మాట్లాడుకోవాలి. సుమారు ఏడెనిమిది నెలల కిందట టీడీపీకి – బీజేపీకి పొత్తు చెడింది. తమ సంకీర్ణంలో ఉన్న పార్టీ అధినేతను తమ పార్టీలోని చిన్నచిన్న లీడర్ల చేత దారుణమైన వ్యాఖ్యలు చేయిస్తుంటే… ఏ పార్టీ అయినా సహిస్తుందా? పైగా గతంలో బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడానికి సహాయం చేసిన పార్టీ, జాతీయంగా పరిచయాలు ఉన్న అధినేత… ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌కు ప్రధానికి టైం లేదంటే… ప్రధానిమంత్రి అంతకు మించి ఇంకేం పనులు ఉంటాయి. సమైక్య వ్యవస్థలో రాష్ట్రాలకు కేంద్రానికి సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఏదీ తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే.. రాష్ట్రం తన ఆదాయం పంచకుండా కేంద్రం ఏ పనిచేయలేదు. వాటిని మళ్లీ మనకే ఖర్చుపెట్టడానికి ఇష్టపడటం లేదంటే… ఇది ప్రజాస్వామ్య హననం.అయితే, చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చే సమయానికే బీజేపీకి దేశ వ్యాప్తంగా ఎదురుగాలి వీయడం మొదలైంది. మోడీ తీసుకున్న ఏ నిర్ణయమూ సత్ఫలితాలను ఇవ్వకపోగా… దేశ ఆర్థిక వ్యవస్థను అవస్థల పాలు చేసింది. దీంతో చాలా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. దీంతో ఆ పార్టీలో అసహనం పెరిగి దౌర్జన్యానికి వేధింపులకు పాల్పడటం మొదలుపెట్టింది. తాజాగా కర్ణాటక రాజకీయమే దీనికి ఉదాహరణ. ప్రజలు ఆ పార్టీకి మద్దతు ఇవ్వకున్నా, ఓట్లు విపరీతంగా తగ్గినా… అధికారం చేపట్టాలని తహతహలాడింది. అప్పట్లో చంద్రబాబు దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసి కుమారస్వామికి అండగా నిలబడటంతో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుంచి తెలుగుదేశం ను బీజేపీ చాలా పెద్ద థ్రెట్‌గా ఫీలయ్యింది. ఎలాగైనా అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయంగా వాడుకోవడం మొదలుపెట్టింది. చివరకు సుప్రీంకోర్టును కూడా వాడుకునే ప్రయత్నం చేసి భంగపడింది. ఇపుడు కేవలం బీజేపీ వ్యతిరేక పక్షాల సభ్యులే లక్ష్యంగా దాడులు చేస్తోంది.దీంతో మోడీ ఉద్దేశం ఏంటో జనాలకు స్పష్టంగా అర్థమవుతోంది. మోడీ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. ఏపీ ప్రజలకు కూడా మోడీ ఆంధ్రకు చేసిన అన్యాయం ఏంటో స్పస్టంగా అర్థమైన నేపథ్యంలో.. ఆంధ్రకు నిధులు ఇవ్వడంలో చేసిన నిర్లక్ష్యంతో ఇప్పటికే రగిలిపోతున్న ఏపీ ప్రజలు మోడీ కక్షసాధింపుతో రగిలిపోతున్నారు. ఇలాంటి ప్రధాని దేశానికే ప్రమాదం అని మోడీ వ్యతిరేకులను అదేపనిగా గెలిచేలా ఓట్లేసే పరిస్థితి ఉంది. మోడీని ఓడించడమే లక్ష్యంగా ఫిక్సయ్యారు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక గాలి ఎంతో కొంత ఉంటుందనుకున్న చంద్రబాబుకు మోడీ చర్యల వల్ల మరింత మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.