ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాభ్యాం
మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశమ్॥
దసరాలో దుర్గమ్మను శ్రీలలితాత్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు.
త్రిపురాత్రయములో రెండొవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత.
త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు.
సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ.
బ్రహ్మవిష్ణుమహేశ్వరులకన్నా పూర్వం నుంచి ఉన్నది కాబట్టి త్రిపురసుందరి అని పిలువబడుతోంది.
శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్ర అధిదేవతగా భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తుంది.
దుర్గమ్మ సన్నిధిలో శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠితమైన శ్రీచక్ర అధిష్టాన దేవత కూడా ఈ లలితాత్రిపురసుందరీదేవే.
పూర్వం దుర్గమ్మ ఆలయంలో శంకరాచార్యులు శ్రీచక్రయంత్రాన్ని ప్రతిష్ఠించారు.
అప్పటి వరకు ఉగ్రస్వరూపంతో చండీదేవిలా ఉన్న దుర్గాదేవి లలితంగా పరమశాంత స్వరూపంతో దర్శనమిస్తోంది.
అందుకని ఇక్కడి శ్రీచక్రానికి నిత్యం లలితా ఆష్టోత్తరం, లలితా సహస్రనామాలతో కుంకుమపూజ చేస్తారు.
లలితాసహస్రనామ స్తోత్రంలో వర్ణించిన విధంగా
‘సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా’ అన్నట్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటూ నిలబడి
లలితా పరాభట్టారికను వింజామరతో సేవిస్తున్నట్లుగా అలంకారం చేస్తారు.
మధ్యలో ఉన్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చెరకుగడను ధరించి,
శివుని వక్షస్థలం మీద కూర్చుని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది.
దారిద్ర్య దుఃఖాలను తొలిగించి సకల ఐశ్వర్యాభీష్టాలను సిధ్ధింపజేస్తుంది.
అమ్మ శ్రీవిద్యా స్వరూపిణి. సృష్ఠి, స్థితి సమ్హార రూపిణి.
కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.
మంత్రము: “ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః” అనే మంత్రము 108 మార్లు జపించవలెను.
నైవేద్యం: చింతపండు పులిహోర ,పెసర బూరెలు,మరియు పంచమి కాబట్టి అరటిపండ్లు అమ్మవారికి సమర్పించాలి .శ్రీ లలిత త్రిపురసుందరి అమ్మవారికి పంచమి వచ్చినచో అరటిపండ్లు అత్యంత ముఖ్యమైన నైవేద్యం.