శ్రీకాకుళం జిల్లాలో శనివారం కుడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. కవిటి మండలం రాజపురం, బొర్రపుట్టుగ గ్రామాల్లో కొబ్బరి, జీడిమామిడి పంటల నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బాధితులను అధైర్యం వద్దని సూచించారు. తాగునీరు, విద్యుత్ ను త్వరితగతిన పునరుద్ధరణ చేస్తామని అన్నారు. తుఫాను వలన కష్టం వచ్చింది. తిత్లి అతలాకుతలం చేసింది. ఆ రోజు రాత్రి అంతా మెళకువగా ఉండి అధికారులతో ఐదు సార్లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించాను. ప్రాణ నష్టం తగ్గించగలిగాం. 25 వేల స్తంభాలు, అనేక చెట్లు కూలాయి. బహుదా పొంగింది. ఫోన్లు పని చేయలేదు. మిమ్మల్ని సాధారణ స్థితికి తెచ్చేవరకు ఇక్కడే ఉంటానని అన్నారు. తుఫాన్లు ఎదుర్కొనే సత్తా పెంచుకోవాలి. మిమ్మల్ని ఆదుకుంటాం. ప్రతి ఎరియాకు ఒక అధికారిని పునరుద్ధరణ పనులకు పంపిస్తున్నాం. వేటకు వెళ్లే మత్స్యకారులకు 50 కిలోల బియ్యం, ఒక కిలో పప్పు, కిలో పామోలిన్ ఆయిల్, కిలో బంగాళదుంపలు, కిలో ఉల్లి, అర కిలో పంచదార., తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారికి పై సరుకులతోపాటు 25 కిలోల బియ్యం ఇస్తాం. మరణించిన ఆవులు,గేదెలకు రూ. 30 వేలు, గొర్రెలు మేకలకు ఐదువేలు, పూర్తిగా ధ్వంసం అయిన బోట్లకు పది వేలు, పాక్షికంగా దెబ్బతిన్న బోట్లకు ఐదు వేలు, పాక్షికంగా దెబ్బతిన్న వాలలకు 2500, పూర్తిగా దెబ్బతిన్న వాళ్లకు ఐదు వేలు నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు. పడిపోయిన కొబ్బరి చెట్లు తొలగిస్తాం. జీడిమామిడికి ట్రిమ్మింగ్ చేయడం, జీవం పోయాలి. ఉద్యానవన పంటల నష్ట పరిహారం పరిశీలిస్తాం. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల తరువాత వరికి శ్రీకాకుళం జిల్లా పెట్టింది పేరని అన్నారు.