మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాందయాళ్ యుకి శనివారంనాడు బీజేపీలో చేరారు. పాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గిన కాంగ్రెస్ నేత బీజేపీలో చేరడం హస్తం నాయకులకు షాకిచ్చింది. పార్టీ జాతీయ అధక్షుడు అమిత్ షా, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ కీలకనేత రాందయాళ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశలలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. నవంబర్ 12న మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన బస్తర్, రాజనందగావ్‌లలో 18 స్థానాల్లో తొలి విడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాందయాళ్ బీజేపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బీఎస్పీ చీఫ్ మాయావతి ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వచ్చిన రోజే రాందయాళ్ కాషాయం పార్టీలో చేరడం గమనార్హం. కాగా, అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం సిద్ధం చేసిన తరుణంలో కీలకనేత పార్టీ ఫిరాయించారు. ప్రాంతీయ పార్టీలతో పొత్తు లేకుండా సొంతంగానే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకోవడం రాందయాళ్ నిర్ణయానికి కారణమై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.