శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం ఉదయం మలయప్ప స్వామి ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కల్పవృక్షంపై తిరుమాడ వీధుల్లో విహరించిన దేవదేవుడు భక్తులకు అనుగ్రహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కల్పవృక్షవాహన సేవ 11 వరకు సాగింది. జీయ్యంగార్ల గోష్టి, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన అమూల్యమైన వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులు ఉండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. సాధారణంగా వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. కల్పవృక్షం మాత్రం వాంఛిత ఫలాలన్నింటినీ అందజేస్తుంది. అలాంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించిన మాడ వీధులలో ఊరేగుతున్న శ్రీవారిని భక్తులకు తనివితీరా దర్శించుకున్నారు. సాయంత్రం ఊంజల్‌సేవ అనంతరం, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు అత్యంత కీలకమైన గరుడవాహన సేవ ఆదివారం రాత్రికి జరగనుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మోహినీ అవతారంలో స్వామివారు దర్శనమిస్తారు. రాత్రి 7 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. ఆదివారం జరిగే గరుడసేవకు ఏడు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళా బృందాలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, హర్యాణా రాష్ట్రాల నుంచి ఈ కళాబృందాలను ఆహ్వానించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా కళాబృందాలతో పాటు తిరుమలకు చేరుకున్నారు.