దేశంలో మొదలైన మీటూ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. సినీ ఇండస్ట్రీలో మొదలైన ఈ ఉద్యమం.. క్రమంగా రాజకీయ నాయకులని దాటుకుండా క్రీడా రంగంవైపు దూసుకొస్తోంది. ఇప్పటికే శ్రీలంక క్రికెటర్లు అర్జున్ రణతుంగ, లసిత్ మలింగల పేర్లు వెలుగులోకిరాగా.. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీఈవో రాహుల్ జోహ్రిపై ఓ మహిళా జర్నలిస్ట్ లైంగిక ఆరోపణలు చేసింది. బీసీసీఐ సీఈవోగా 2016లో బాధ్యతలు చేపట్టకముందు రాహుల్ జోహ్రి డిస్కవరీ నెట్‌వర్క్స్‌లో దక్షిణ ఆసియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనని అతను లోబరుచుకున్నట్లు ఓ మహిళా జర్నలిస్ట్ సుదీర్ఘంగా రాసుకొచ్చింది. దాన్ని @PedestrianPoet అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెలుగులోకి తెచ్చారు.
ఉద్యోగం గురించి మాట్లాడే నెపంతో కాఫీ తాగేందుకు నన్ను రాహుల్ జోహ్రి ఓ చోటుకి ఆహ్వానించాడు. అక్కడ.. కాసేపు మాట్లాడిన తర్వాత తన ఇంటికి వెళ్దామని చెప్పాడు. అప్పటికే అతను తన భార్యని నాకు పరిచయం చేసి ఉండటంతో.. ఆ చనువుకొద్దీ నేను కూడా వెళ్లేందుకు అంగీకరించాను. కానీ.. ఇంటికి వెళ్లేసరికి.. అతని భార్య ఇంట్లో లేదు. వెంటనే.. నేను మీ భార్య ఎక్కడ..? అని అడిగా. తను బయటికి వెళ్లిందని చెప్పాడు. ఆ తర్వాత నన్ను ఇంట్లోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ నాతో కాసేపు ఉద్యోగం గురించి మాట్లాడి.. తన మనసులోని ‘కోరిక’ను బయటపెట్టాడు. నేను వద్దని వారిస్తున్నా.. నా శరీరాన్ని ఆక్రమిస్తూ లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత నాపై నాకే అసహ్యం వేసింది. ఈ విషయాన్ని ఎవరితోనూ ఇప్పటివరకూ చెప్పుకోలేకపోయాను’ అని బాధితురాలు వివరించింది.