శ్రికాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించిన తిత్లీ తుఫాన్ నష్టంపై శనివారం ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రాథమిక నివేదిక అందజేసింది. ఈ తుఫాన్ ధాటికి సుమారు 9 లక్షల మంది ప్రభావితమయ్యారని, 8 మంది మృతి చెందారని, ఇద్దరు మత్స్యకారులు గల్లంతైనట్లు అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. 290 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయని, 8,962 ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్థం కావడంతో సుమారు 4319 గ్రామాలు చీకటిమయమయ్యాయని తెలిపారు.తిత్లీ తుపాను దెబ్బకు ఉద్దానం ఊపిరాగింది. 30 ఏళ్లుగా చెట్టుతో పెనవేసుకున్న బంధం ఒక్కసారిగా నేలమట్టమైంది. కూకటివేళ్లతో కూలిపోయిన జీడి, కొబ్బరి చెట్ల వద్దే రైతన్న గుండె పగిలేలా రోదిస్తున్నాడు. బిక్కచచ్చి బావురుమంటున్నాడు. ఊళ్లన్నీ శ్మశానాన్ని తలపిస్తున్నాయి. ‘చెట్లు కాదు.. మా ప్రాణాలే పోయాయి’ అంటూ పల్లె జనం ఘొల్లుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి మండలాల్లో ఏ ఊరుకెళ్ళినా ఇదే పరిస్థితి. మచ్చుకు ఒక్క చెట్టయినా కన్పించని దారుణమైన విషాదం నుంచి రైతన్న కోలుకోవడం లేదు. తాతలనాడు వేసుకున్న చెట్లు.. పసిపిల్లల్లా పెంచుకున్న వనాలను గుండె చెదిరిన రైతన్న గుర్తుచేసుకుంటూ గగ్గోలు పెడుతున్నాడు. ఉపాధి పోయి ఊళ్లొదిలే పరిస్థితిని చూస్తూ కుమిలిపోతున్నాడ.శ్రీకాకుళం జిల్లాలోని 1,39,844 హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని, మత్స్య శాఖకు రూ.9 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదికలో పేర్కొన్నారు. అలాగే 80 చెరువుల దెబ్బతిన్నాయని, 87 పశువులు మృతి చెందినట్లు చెప్పారు. శ్రీకాకుళంలో 15 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.