తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలుపుపై టెన్షన్ తో ఉన్నారా?. ఆయన నిర్ణయాలు..ఆలోచనలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయని పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. నాలుగేళ్ల పాలన తర్వాత కూడా ప్రజలను పూర్తిగా అధికార పార్టీ వైపు తిప్పుకోవటంలో విఫలమయ్యారా?. ఈ అనుమానంతోనే కెసీఆర్ చకచకా పావులు కదుపుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పార్టీ నేతల్లో. కొత్తగా జనవరి నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభించారు. మరో వైపు పెట్టుబడి సాయం కింద ఒక్కో పంటకు నాలుగు వేల రూపాయం సాయం చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నిర్ణయం అమలు చేయటమే ఆలశ్యం. ఇప్పుడు కొత్తగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేయాలని కెసీఆర్ యోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఒకే సారి రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది. గత ఎన్నికల సమయంలో లక్ష రూపాయల రుణ మాఫీ ప్రకటించిన కెసీఆర్..ఇప్పుడు ఓ వైపు దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని..మరో వైపు పంట సాయం కింద నాలుగు వేల రూపాయలు ఇవ్వటానికి రెడీ అయి కూడా మళ్లీ రెండు లక్షల రుణ మాఫీ ఆలోచన చేయటం అంటే కాంగ్రెస్ హామీ తమ కొంప ముంచుతుందేమో అన్న భయంతోనే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది టీఆర్ఎస్ అమలు చేసిన లక్ష రూపాయల రుణ మాఫీ హామీ ఇప్పుడు రెండు లక్షల రూపాయలకు ఎందుకు పెంచాల్సి వచ్చింది. నిజంగా రైతులు కష్టాల్లో ఉన్నారని భావిస్తే తొలిసారే రెండు లక్షలు ఇఛ్చి ఉండాల్సి కదా. అయినా రైతులు ఎవరూ తమకు ఉచితంగా ఏదీ కావాలని కోరు. తాము చేసే వ్యవసాయానికి సరైన…అర్థవంతమైన గిట్టుబాటు ధర లభిస్తే చాలని కోరుకుంటారు. దానికంటే ముందు నకిలీ లేని విత్తనాలు అందుబాటులో ఉంచితే చాలు. పండిన పంటకు మద్దతు ధర ఇస్తే చాలని అంటారు. కానీ అది కాంగ్రెస్ అయినా..టీఆర్ఎస్ అయినా ఇలా ఎన్ని సంవత్సరాలు రైతులకు రుణ మాఫీ చేయగలుగుతాయి?. రైతులు స్వయంసమృద్ధి సాధించేలా చేయాలే కానీ… ఒకరు లక్ష రుణ మాఫీ అంటే మరొకరు రెండు లక్షలు అంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా రెండు లక్షల హామీకి రెడీ అయిపోతుందా?. చూడాల్సిందే. ఓ వైపు రైతులను ఆకట్టుకునే పనిలో ఉన్న కెసీఆర్ తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీలపై ఫోకస్ పెట్టారు. సబ్ ప్లాన్ పెట్టి వారికి బడ్జెట్ కేటాయింపులు భారీగా చేసేందుకు రెడీ అయిపోతున్నారు. చూడాలి వచ్చే ఎన్నికల్లో ఎవరి ఎత్తులకు ఎవరు చిత్తవుతారో.