ప్రతిష్ఠాత్మక పదహారో నెంబరు జాతీయ రహదారి నిర్వహణ జిల్లా పరిధిలో అధ్వానంగా ఉంటోంది. టోల్ పేరిట నిధులు వసూలు చేస్తున్నా... రోడ్డు బాగు కానీ, ప్రయాణికుల సౌకర్యాలు కానీ పట్టించుకోవడం లేదు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్16) జిల్లా పరిధిలో 110 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. జిల్లాలోని ఏడు నియోజక వర్గాలను తాకుతూ వెళ్తోంది. నిధులు పుష్కలంగా ఉన్నా నిర్వహణ తీరు అధ్వానంగా ఉంది. ఈ దారిన పయనించే వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు తప్పితే ఆ స్థాయిలో సేవలు అందించడం లేదు. ఫలితంగా ప్రమాదాలు నిత్యకృత్యమై పోయాయి. ప్రాణ నష్టం జరుగుతోంది. అయినా పర్యవేక్షక యంత్రాంగం నిద్ర నటిస్తోంది.
జిల్లాలో పెదపాడు మండలం అప్పనవీడు నుంచి పెనుగొండ మండలం సిద్ధాంతం వరకు జాతీయ రహదారి ఉంది. అప్పనవీడు నుంచి గుండుగొలను వరకు విజయవాడ ప్రాజెక్టు పరిధిలో గుండుగొలను నుంచి పెనుగొండ వరకు రాజమహేంద్రవరం ప్రాజెక్టు పరిధిలో ఉంది. జాతీయ రహదారి అనగానే అంతా చాలా బాగుంటుందని భావిస్తుంటారు. అందుకు విరుద్ధంగా జిల్లా పరిధిలో చాలా చోట్ల గతుకులమయంగా తయారైంది. పెద్దపెద్ద గోతులతో నిండిపోయింది. కొన్నిచోట్ల రోడ్డు కుంగి వాహనాలు తిరగబడతాయేమోనని వాహనదారులు భయపడే పరిస్థితి ఉంది. అరకొరగా మరమ్మతులు చేస్తున్నా వాటిపై కూడా వాహనాలు ఎగిసిపడుతున్నాయి.
జిల్లాలోని పలు చోట్ల రహదారిపై గోతులున్నాయి. విజయవాడ ప్రాజెక్టు పరిధిలోని పెదవేగి మండలం భోగాపురం సమీపంలో భారీ జాతీయ జెండా సమీపంలో రహదారి కుంగింది. ఇక్కడకు వచ్చే సరికి వాహనాలు ఒరుగుతున్నాయి. ఇదే పరిస్థితి పలుచోట్ల ఉంది. ఈ రహదారిపై పెదఅవుటపల్లి నుంచి గుండుగొలను వరకు తారు పోశారు. ఈ క్రమంలో పలుచోట్ల రహదారి బాగుందని వదిలేశారు. అలా వదిలేసిన చోట బీటలు వారి గోతులు పడుతున్నాయి. వీటిపై తారు పోసి మరమ్మతులు చేశారు. అవి కూడా ఎత్తుపల్లాలుగా ఉండటంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రాజమహేంద్రవరం పరిధిలోని రహదారిలో గుండుగొలను నుంచి సిద్ధాంతం వరకు పలుచోట్ల గోతులతో నిండి ఉంది. ఉంగుటూరు టోల్ గేటు వద్దనే గోతులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఉంగుటూరు జంక్షన్, నారాయణఫురం జంక్షన్‌ల పరిధిలోనూ గోతులున్నాయి. ఈ ప్రాంతాల్లో గోతుల కారణంగా వాహనాలు అదుపుతప్పితే ప్రాణనష్టం తప్పదు. పెరవలి.. సిద్ధాంతం, తేతలి, భీమడోలు పరిధిలో పలుచోట్ల రహదారి గోతులమయంగా మారింది. వంతెనలపై కూడా వాహనాలు ఎగిరిపడుతున్నాయి. తమ్మిలేరు, వ్యాసగాని నది, తదితర వంతెనలపై ఎత్తుపల్లాల కారణంగా వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు.
జాతీయ రహదారిపై నిర్మించిన వంతెనలు, రహదారికి ఇరువైపులా కాలువలున్న చోట ప్రమాదాల నివారణకు ఇనుప బద్దెలతో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ప్రమాదాల్లో చాలాచోట్ల ఇవి పాడయ్యాయి. తిరిగి పునరుద్ధరిస్తున్న సంఘటనలు అంతంత మాత్రమే. జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించే క్రమంలో ప్రస్తుతం ఉన్న రహదారికి ఇరువైపులా కొంత మేర తవ్వేశారు. పెదవేగి మండల పరిధిలో ఇరువైపులా తవ్వకాలు సాగించారు. ఈ పనులు మధ్యలో నిలిచిపోవడంతో పలుచోట్ల రహదారి ప్రమాదకరంగా ఉంది. ఇందుకు సంబంధించి ఇనుప బద్దెలతో పలుచోట్ల రక్షణ చర్యలు చేపట్టారు. ఇవి కూడా దెబ్బతిని కొత్త ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మొక్కల పెంపకం, వాటికి నీరు పోయడం వంటి పనులు కూడా నిర్వహణలో భాగమే. జాతీయ రహదారి ప్రారంభమైనప్పటి నుంచి ఏటా నిధులు వస్తున్నా చాలా చోట్ల నేటికీ మొక్కలు లేవు. ఏలూరు ఆశ్రం ఆసుపత్రి కూడలి నుంచి గుండుగొలను వరకు డివైడర్‌పై 70 శాతం వరకు మొక్కలు లేవు. ఉన్న మొక్కలకు నీరు పోయడం కూడా అంతంత మాత్రంగానే చేస్తున్నారు. డివైడర్‌పై మొక్కలు ఏపుగా పెరగడం వల్ల వాహనాలు ఎదురెదురుగా ప్రయాణించే సమయంలో వాటి లైట్ల వెలుగులు ఒకరిపై ఒకరివి పడకుండా ఉంటాయి. తద్వారా ప్రమాదాలు కూడా తగ్గుతాయి. భీమడోలు, ఉంగుటూరు మండలాల పరిధిలో డివైడర్‌పై మొక్కలు ఏపుగా పెరిగి రహదారిపైకి వస్తున్నాయి. వీటిని కత్తిరించే చర్యలు చేపట్టడం లేదు. జాతీయ రహదారికి ఇరువైపులా పెరిగే పిచ్చి, ముళ్ల మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. కానీ సకాలంలో వీటిని తొలగించడానికి చర్యలు చేపట్టని కారణంగా ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు రహదారిపైకి వస్తున్నాయి. వీటితో వాహన చోదకులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ఇనుప బద్దెలను దాటి రహదారి పైకి వస్తున్నాయి. రహదారి పక్కన గడ్డిని పూర్తిస్థాయిలో తొలగించడం లేదు. రహదారిపై దుమ్ము పేరుకుపోతోంది. వర్షాలు పడినప్పుడు నీరు బయటకు పోకుండా రహదారిపైనే నిలుస్తుంది. వాహనాల రాకపోకల సమయంలో ఇది సమస్యగా మారింది.