YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

ఏపీలో కాంగ్రెస్, టీడీపీ ఆరు-ఇరవై...

ఏపీలో కాంగ్రెస్, టీడీపీ ఆరు-ఇరవై...
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, కాంగ్రెస్‌ మధ్య ఎన్నికల పొత్తులు సీట్ల కేటాయింపులపై స్థూలంగా అవగాహన కుదిరినట్లు సమాచారం. ఆరు లోక్‌సభ, ఇరవై వరకు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌కు వదిలి పెట్టేందుకు టిడిపి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. లోక్‌సభ సీట్ల విషయంలో ఏ ఏ స్థానాలను కాంగ్రెస్‌కు వదిలిపెట్టేదీ టిడిపి ప్రతిపాదించినట్లు తెలిసింది. అసెంబ్లీ సీట్లదగ్గరకొచ్చేసరికి కాంగ్రెస్‌లో ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న సీనియర్లు, ముఖ్యులందరికీ సీట్లు గ్యారంటీ ఇచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్‌ అధిష్టానం, టిడిపి ముఖ్య నాయకుల మధ్య ఢిల్లీలో ఇటీవల దఫదఫాలుగా నిర్వహించిన భేటీల్లో చాలా మట్టుకు రెండు పక్షాలూ సీట్ల కేటాయింపులపై ఏకాభిప్రాయానికొచ్చినట్లు కాంగ్రెస్‌, టిడిపి వర్గాలు గుస గుసలాడుతున్నాయిఎపిలో ఎన్నికలకు ఇంకా ఆరేడు మాసాల సమయమున్నప్పటికీ ముందస్తుగా ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగుతున్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణాతోపాటే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కూడా ఒక మాట అనుకుంటే మంచిదన్న అభిప్రాయానికి రెండు పార్టీలూ వచ్చాయని తెలిసింది. . తెలంగాణాలో వలే నేరుగా రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందా లేదా అనే అంశం ప్రస్తుతానికి ఇతిమిద్ధంగా తేలకపోయినా ఏదో ఒక రూపంలో అవగాహన, సర్దుబాట్లు ఉంటాయని, దానికైనా ముందు నుంచే ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం, అందుకనుగుణంగా పక్కా ప్రణాళిక ఎంతైనా అవసరమని ఇరు పక్షాలు అనుకున్నట్లు తెలిసింది.అసెంబ్లీ స్థానాలదగ్గరకొస్తే కాంగ్రెస్‌ నాయకులు కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్‌, కోట్ల సుజాతమ్మ, జెడి శీలం వంటి ముఖ్యులందరికీ సీట్లు వదిలేందుకు టిడిపి సూచనాప్రాయంగా అంగీకరించింది. నేరుగా ఆ నేతలు ఎన్నికల బరిలోకి దిగకపోతే వారు సిఫారసు చేసిన వారికి స్థానాలను టిడిపి రిజర్వ్‌ చేయనుంది. మొత్తమ్మీద 20 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌కు విడిచిపెట్టేందుకు సుముఖంగా ఉంది. కాగా అంతమంది అభ్యర్ధులు దొరుకుతారా అనే అంశం చర్చల్లో వచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు వీలైనంత వరకు అసెంబ్లీ స్థానాలను తగ్గించి అది కోరిన లోక్‌సభ స్థానాలను ఇచ్చేందుకు టిడిపి పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌కు టిడిపి వదిలిపెడతానంటున్న లోక్‌సభ స్థానాల్లో చాలా మట్టుకు వైసిపి సిట్టింగ్‌ సీట్లు లేదా టిడిపి పరిస్థితి బాగా లేదని అంతర్గత సర్వేల్లో నిర్ధారించిన స్థానాలు. రాజంపేట, తిరుపతి, అరకు, కర్నూలు గతంలో వైసిపి గెలిచినవి. అరకు, కర్నూలు ఎంపిలు టిడిపిలోకి ఫిరాయించారు. విశాఖపట్నంలో గతంలో పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్థి గెలుపొందారు. నర్సాపురం కూడా అంతే. కాకినాడ టిడిపి సిట్టింగ్‌ స్థానమే అయినా జనసేన ప్రభావం ఎక్కువని, పైగా ప్రస్తుత ఎంపి తోట నర్సింహంపై ప్రజల్లో సానుకూలత లేదని టిడిపి భావించింది. ఇక నర్సాపురంలో కూడా జనసేన ప్రభావం బాగానే ఉంటుందని టిడిపి అంచనా వేసింది. కాంగ్రెకు టిడిపి విడిచిపెట్టే లోక్‌సభ స్థానాలు దాదాపు ఖరారయ్యాయి. కర్నూలు, రాజంపేట, తిరుపతి, విశాఖపట్నం, అరకు, కాకినాడ లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు టిడిపి ఇవ్వనుంది. కర్నూలు, తిరుపతి, కాకినాడ, అరకులో కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాశరెడ్డి, చింతామోహన్‌, పల్లంరాజు, వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ పోటీ చేస్తారని చెపుతున్నారు. విశాఖపట్నం నుంచి మాజీ ఎంపి టి సుబ్బరామరెడ్డిని కాంగ్రెస్‌ బరిలోకి దించనుందని సమాచారం. రాజంపేట విషయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరైందీ ఇంకా స్పష్టత రాలేదు. నర్సాపురం లోక్‌సభకు రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ పోటీ చేసేటట్లయితే పైన పేర్కొన్న ఆరింటిలో ఒక స్థానాన్ని కాంగ్రెస్‌ వదులుకుంటుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీకి వట్టి పోటీ చేస్తారన్న వాదన సైతం ప్రచారంలో ఉంది.

Related Posts