ఏపీలో పలు ఆలయాల్లో దేవీ నవరాత్రి ఉత్సావాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం నాడు
విజయవాడ ఇంద్రకీలాద్రి లో శరన్నవరాత్రులలో ఆరవ రోజు కనకదుర్గమ్మ భక్తులకు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలూ తీసుకున్నారని దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. ఇప్పటి వరకు అమ్మవారిని 9.40 లక్షల మంది దర్శించుకున్నారని అమె అన్నారు. మూలానక్షత్రం రోజున అమ్మవారిని 4.15 లక్షల మంది దర్శించుకున్నారన్నారు. మూలానక్షత్రం నాడు 97 వేల మందికి అన్నదానం, 4.70 లక్షల మందికి కుంకుమ ప్రసాదం, 30 వేల మందికి వైద్య సదుపాయం అందించామని తెలిపారు. భవానీ దీక్షాదారుల కోసం దుర్గాష్టమి నాడు హోమ గుండాలను ప్రారంభిస్తున్నామని ఆమె వెల్లడించారు. భవానీలు తీసుకువచ్చే నేతి కొబ్బరికాయలను ఇకపై చండీ హోమంలో వాడాలని వైదిక కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో అన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఆరోరోజు దసరా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. భ్రమరాంబ దేవి కాత్యాయిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు హంసవాహన, పుష్పపల్లకి సేవలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం 10వ శక్తిపీఠమైన పాదగయా క్షేత్రంలో రాజరాజేశ్వరీ అమ్మవారు సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం కావడంతో పలుచోట్ల సరస్వతీ పూజలు నిర్వహించారు.