మనిషిని సంకల్పశక్తి ముందుకు నడిపిస్తుంది. శీలవంతుడైన మనిషి మహావృక్షంలా దృఢంగా ఉంటాడు. అతడి చరిత్రలో బద్ధకం, భయాలకు స్థానం ఉండదు. ఇంకొకరి సాయంకోసం ఎదురుచూడడు. తాను ఎంచుకున్న మార్గంలోనే సాగిపోతుంటాడు.
ఆలోచన కార్యరూపం దాల్చి నప్పుడే విజయం సిద్ధిస్తుంది. దృఢ సంకల్పమే మానవుడికి అపార శక్తినిస్తుంది. అతడి జీవితం కళకళలాడుతుంది. జీవితాన్ని కళాత్మకంగా గడపటానికి పెద్దలు అనేక సంప్రదాయాలు ఏర్పాటు చేశారు. కొత్త జంట పెళ్లి వస్త్రాలతో అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేయడాన్ని ఒక సజీవ కళగా భావిస్తూ, బంధుమిత్రులందరూ సంతోషంగా చూస్తారు. జీవితంలో ప్రతి అడుగూ కళాత్మకతను సంతరించుకోవాలి. అందుకే ఆచారాల పేరుతో విజ్ఞులు, ఇల్లు ఎప్పుడూ కళకళలాడే పద్ధతులు సూచించారు.
త్యాగం, సేవాభావం వంటి సంస్కృతులూ పలు రూపాల్లో కనిపిస్తుంటాయి. వీటన్నింటినీ ఒక్కచోటికి చేరిస్తే- అదే ‘ప్రేమ’ అవుతుంది. దాని పరిధిలో ఉన్నదే సంస్కృతి. గొప్ప పనులు చేసినవారిపై అభినందనలు కురుస్తాయి. వారికి అప్పుడే జాగ్రత్త అవసరం. ఐక్యభావనతో ముందుకు సాగితే... అదే నిజమైన జీవన కళ!