దేశవ్యాప్తంగా మీ టూ మంటలు రేగుతూనే ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో మొదలైన ఈ ప్రకంపనలు.. స్పోర్ట్స్, మీడియా, రాజకీయాలకు పాకాయి. ఏకంగా కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌పైనా ఆరోపణలు వచ్చాయి. అక్బర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సోమవారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారు. ఢిల్లీలోని మూర్తి మార్గ్‌కు భారీగా చేరుకున్న కార్యకర్తలు.. బారికేడ్లను దాటే ప్రయత్నం చేశారు. కేంద్రమంత్రి ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్బర్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల్ని చెదరగొట్టారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధ్యతాయుతమైన విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తిపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయని.. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు. అక్బర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఎంజే అక్బర్‌పై మీటూ ఆరోపణలు వచ్చాయి. ఆయన పత్రికా ఎడిటర్‌గా పనిచేసే రోజుల్లో తమను వేధించారంటూ కొందరు మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేంద్రమంత్రి కూడా స్పందించారు.. తాను లైంగిక వేధింపులకు పాల్పడ్డానంటూ వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. తాను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందే ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన ఆయన.. తనపై అసూయతో, ప్రతిష్ఠకు భంగం కల్గించేందుకే ఇలాంటివి సృష్టిస్తున్నారన్నారు. తాను విదేశీ పర్యటనలో ఉండటంతో ఈ ఆరోపణలపై స్పందించలేదన్నారు అక్బర్.