పరిస్థితి అధ్వానంగా మారింది. నిర్వహణ కరవవడంతో కేంద్రాల్లో కిట్ల దగ్గర నుంచి యంత్రాల మరమ్మతుల వరకు అన్నింటా కష్టాలే నెలకొన్నాయి. ముఖ్యంగా నిధుల లేమితో అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లాలో ఆదోనిలోని రక్తదాన కేంద్రంతోపాటు ఎమ్మిగనూరు, డోన్, కోవెలకుంట్ల, పత్తికొండ, ఆత్మకూరులో రక్త నిల్వ కేంద్రాలు నెలకొల్పారు. వీటిలో నెలకు సరాసరి 800-1000 మంది కేసుల దాకా రక్తం అవసరమవుతుంది. ఆయా కేంద్రాలపై ముందుచూపు కరవవడం, అవసరాలు.. సమస్యలను అధికారులు గుర్తించకపోవడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆదోని కేంద్రంలో కిట్ల సమస్య నెలకొంది. మిగిలిన నిల్వ కేంద్రాల్లో రోగులకు అవసరమైన రక్తం అందించడంలోనూ కష్టాలే ఎదురవుతున్నాయి. ఫలితంగా జనం ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఆదోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో పదేళ్ల క్రితం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నేతృత్వంలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేశారు. 2017, మేలో ఐఆర్‌సీఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల పరిధిలోకి తెచ్చి సేవలందిస్తోంది. పరిధిలోకి తెచ్చిన నాటి నుంచి నేటి వరకు కిట్ల వద్ద నుంచి కూలర్ల మరమ్మతుల వరకు సమస్యలు నెలకొన్నాయి. రక్త సేకరణ చేశాక వాటికి హెచ్‌ఐవీ, హెచ్‌బీసీ, హెచ్‌సీవీ పరీక్షలు నిర్వహించాలి. అందుకు మూడు రకాల కిట్లు అవసరమవుతుంది. ఇందులో హెచ్‌సీవీ కిట్లు సవ్యంగా సరఫరా జరగడం లేదు. నెలవారీగా 200-300 మించి అందడం లేదు. దీంతో మూడు పరీక్షలు చేస్తేగాని.. రక్త ప్యాకెట్లను రోగులకు అందించలేని పరిస్థితి నెలకొంది. ఇక రక్తనిల్వకు మూడు భారీ ఫ్రిజ్‌లు అందించారు. ఒక్కో దానిలో కనీసం వంద ప్యాకెట్ల మేర రక్తాన్ని నిల్వ చేయొచ్చు. ఇందులో ఒకటి మరమ్మతుకు గురై మూలన పడింది. మూడు చిన్న శీతల యంత్రాలు ఉన్నా వాటి పరిస్థితీ అంతే. రక్తసేవలకు కచ్చితంగా ఏసీలు అవసరం. ఏసీ యంత్రం మరమ్మతుకు గురై ఏడాదవుతోంది. ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. ఇక కేంద్రానికి ప్రత్యేకంగా విద్యుత్తు నియంత్రికతోపాటు త్రీఫేజ్ విద్యుత్తు కావాలి.. ఆస్పత్రి మొత్తానికి ఒకే విద్యుత్తు వ్యవస్థ ఉండడంతో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి.
ఆత్మకూరు రక్తనిల్వ కేంద్రంలో నెలకు 30-40 దాకా రక్త సేవల కోసం జనం వస్తున్నారు. అందుతున్న రక్తసేవలు మాత్రం 10-15 మించి ఇవ్వడం లేదు. ముఖ్యంగా ప్రసవం, ప్రమాద కేసులే అధికంగా ఉంటున్నాయి. పత్తికొండ కేంద్రానికి లైసెన్స్ రెన్యువల్ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఇక్కడ నెలకు 30 కేసులు వస్తుంటాయి. నెలకు అందిస్తున్న సేవలు 10కి దాటడం లేదు. కోవెలకుంట్లలో సైతం ఇదే పరిస్థితి... 10-15 మందికి మాత్రమే సేవలందుతోంది. ఏదైనా అత్యవసరమైతే.. నంద్యాలకు పరుగులు పెట్టాల్సిందే. జాతీయ రహదారిపై ఆనుకుని ఉన్న డోన్ పట్టణంలోనూ ఇదే దుస్థితి. దీంతో బాధితులకు సకాలంలో రక్తం అవసరమవుతోంది. ఇలాంటి చోట సైతం 10-15 మించి కేసులకు రక్తం అందడం కష్టంగా మారింది. లేకపోతే.. కర్నూలుకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.
ఆదోని పరిధిలోని 17 మండలాలకు ఆదోని రక్త నిల్వ కేంద్రం నుంచి సరఫరా కావాలి. నంద్యాల డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, బనగానపల్లె తదితర ప్రాంతాలకు నంద్యాల నుంచే సరఫరా కావాలి. ఇక మిగిలిన ప్రాంతాలు కర్నూలు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఐదు రక్తనిల్వ కేంద్రాలు ఆదోని, నంద్యాల, కర్నూలు రక్తదాన కేంద్రాలకు అనుసంధానం చేశారు. నిర్దేశించిన కేంద్రాల నుంచి నిల్వ కేంద్రాల నిర్వాహకులు రక్త ప్యాకెట్లను తెచ్చుకోని.. కేంద్రాల్లో నిల్వ చేసి..వచ్చిన బాధితులకు సరఫరా చేస్తున్నారు. ఏ కేంద్రం చూసిన నెలకు 10-15 మించి సేవలు ఇవ్వడం లేదు. కారణం.. ప్రధాన కేంద్రాల నుంచి నిల్వ కేంద్రాలకు అనుకున్నంత స్థాయిలో ప్రోత్సాహం ఉండకపోవడమే కారణం.
రక్తనిల్వ కేంద్రాలు అలంకారప్రాయంగా తప్పితే జనానికి ఆశించినస్థాయిలో సేవలందడం లేదు. కారణం.. డివిజన్ కేంద్రాల నుంచి నెలకు వారిచ్చిన 10-15 రక్త ప్యాకెట్లను తెచ్చి నిల్వ కేంద్రాల్లో భద్రపరుస్తున్నారు. ఎవరైనా బాధితులు వస్తే అడిగిన గ్రూప్ రక్తం ఉంటే గ్రూపింగ్ పరీక్షించి క్రాస్ మ్యాచ్ చేసి... సరఫరా చేస్తున్నారు. అదే లేకపోతే వెనక్కి పంపుతున్నారు. ఇక్కడా స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన వారికి బ్లీడ్ చేసేందుకు.. రక్త పరీక్షలు చేసి బాధితులకు అందించే వెసులుబాటు లేదు. ఫలితంగా జనం పట్టణాలు.. నగరాలకే పరుగులు పెడుతున్నారు. అదే బ్లీడింగ్, పరీక్షలకు అవకాశం ఇస్తే కొంతవరకు సమస్యలు తీరే అవకాశాలున్నాయి.