YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో జనసేన అభ్యర్ధులకు కావలెను...

కర్నూలులో జనసేన అభ్యర్ధులకు కావలెను...
జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ పార్టీ రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభావం చూపుతున్నా జిల్లాలో మాత్రం ఎక్కడా పార్టీ జెండా కనిపించని పరిస్థితి నెలకొని ఉంది.  సాధారణ ఎన్నికలకు ముందు సినీనటుడు పవన్‌కల్యాణ్ రాజకీయ పార్టీని స్థాపించి ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు తన మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఆ పార్టీ ఒంటరిగా రానున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆయన పొరుగున ఉన్న అనంతపురం జిల్లాలో సైతం పర్యటించినా కర్నూలులో మాత్రం ఇప్పటి వరకూ రాజకీయ యాత్ర చేపట్టలేదు. జూలైలో ఆలూరు నియోజకవర్గంలోని హత్తిబెళగల్ గ్రామం వద్ద క్వారీలో జరిగిన పేలుళ్ల సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ తరువాత కర్నూలులో బాధిత కుటుంబాల వారిని పరామర్శించి వెళ్లారు. అంతే తప్ప జనసేన పార్టీ కార్యక్రమాలేవీ జిల్లాలో చేపట్టలేదు. దాంతో జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేయబోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. జనసేన పార్టీకి కనీస పార్టీ ప్రతినిధి కూడా లేరు. పార్టీ జిల్లా కమిటీని నియమించకపోవడం, పార్టీ కార్యక్రమాలేవీ చేపట్టపోవడంతో రానున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేయకపోవచ్చన్న వార్తలకు బలం చేకూరుస్తోంది. జనసేన జిల్లాలో ఏ మాత్రం ప్రభావం చూపకపోవడానికి కారణం వైసీపీతో కుదిరిన ఒప్పందమేనని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. జనసేన తరఫున అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగితే ఆ ప్రభావం అత్యధికంగా వైసీపీ ఓటు బ్యాంకుపై పడుతుందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. అంతేగాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు సైతం వైసీపీ కంటే జనసేనకే ఎక్కువగా పడతాయని వారు అంచనా వేస్తున్నారు. జిల్లాలో నందమూరి అభిమానులకు దీటుగా మెగా అభిమానులు ఉన్నారని రాజకీయ విశే్లషకులు సైతం వెల్లడిస్తున్నారు. అంతేగాక ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బలిజ, కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు వారు లెక్కలు వివరిస్తున్నారు. వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్‌పై ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయం కూడా జనసేన పార్టీకి ఓట్లను రాబట్టడంలో అనుమానాలేవీ లేవని వారంటున్నారు. అయితే పార్టీ అభ్యర్థుల ఎంపిక తరువాతే జనసేన విజయంపై విశే్లషించవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన మంచి ఓట్ల శాతాన్ని సంపాదించుకుంటుందనడంలో సందేహం లేదని వారు వెల్లడిస్తున్నారు. టీడీపీ అనుమానిస్తున్నట్లుగా జనసేనకు వచ్చే ఓట్లలో ఒక్క వైసీపీకే కాకుండా టీడీపీకి కూడా నష్టం తప్పదని వారంటున్నారు. ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు విషయంలో వైసీపీకి భారీ నష్టం తప్పదని వారు విశే్లషిస్తున్నారు. కాగా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున జనసేన పార్టీ నిర్మాణంపై పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దృష్టి సారించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా జనసేన రానున్న ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, నామమాత్రంగా పోటీ చేసినా టీడీపీ ఆరోపణలకు బలం చేకూరుస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో వైసీపీ కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా లబ్ధి పొందే అవకాశాలు లేకపోలేదని వారు భావిస్తున్నారు.

Related Posts