వైసిపి అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో సమస్యలతో చుట్టుముడుతున్నారు ప్రజలు. సామాన్యుల నుంచి న్యాయవాదులు, వైద్యులు, టీచర్లు వృద్ధులు, ఇలా అన్ని వర్గాల వారు ప్రభుత్వం పై ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తూ మీరు అధికారంలోకి వస్తే మా సమస్యలు తీర్చండి అంటూ జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. పాదయాత్రలో జగన్ విడిది చేసే ప్రాంతంలో ఉదయం సమయంలో సమస్యలతో వస్తున్న ప్రజల రద్దీతో ఆ ప్రాంతం తిరునాళ్లలా మారిపోతుంది. ఇక యాత్ర సాగే సమయంలో సైతం జనం తమ సమస్యలు నివేదిస్తూ జగన్ తో అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్ పాదయాత్ర జరిగిన తీరును ఆయన పాలనలో తమకు చేకూరిన లబ్ది వివరిస్తూ ఉండటంతో వైసిపి చీఫ్ హుషారుగా సాగిపోతున్నారు.జగన్ పాదయాత్రకు తుఫాన్ దెబ్బ తగలడంతో స్వల్ప విరామం తరువాత వైసిపి చీఫ్ తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రతి వారితో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు ఆయన. వారి నుంచి సమస్యను దాని పరిష్కరానికి వారిచ్చే సలహాలు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. రైతులు చేతివృత్తులు వారు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, వైద్యులు, పొరుగు సేవల సిబ్బంది వృద్ధులు, వికలాంగులు విపక్ష నేత ను కలిసి ప్రతి చోటా తమ సమస్యలు చెప్పుకోవడం కనిపిస్తుంది.అయితే ఇటీవల తిత్లీ తుపాను కారణంగా జగన్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి గజపతి నగరంలో పాదయాత్రను ప్రారంభించారు. తుపాను తో నష్టపోయిన రైతాంగం, ప్రజలతో జగన్ మమేకం అవుతున్నారు. వారి బాధలను అడిగితెలుసుకుంటున్నారు. తుపాను వల్ల పాదయాత్రకు జనం పలుచన బడతారేమోనన్న బెంగ నిన్నటి వరకూ వైసీపీ నేతల్లో ఉంది. కానీ ఉత్తరాంధ్ర లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తుఫాన్ ప్రభావం తో నష్టం తీవ్రంగా వాటిల్లినా జగన్ ప్రజాసంకల్ప యాత్ర పై దాని ప్రభావం పెద్దగా లేకపోవడం తో వైసిపి శ్రేణులు ఊపిరిపీల్చుకుంటున్నాయి