తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మానవ వనరులను ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. అదే సమయంలో పార్టీలోని సీనియర్లను ఎలా దారికి తేవాలో కూడా తెలుసు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న నీతిని ఇపుడు చంద్రబాబు అమలుచేయబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్ద పీట వేద్దామనుకుంటున్న టీడీపీ అందులో భాగంగా మంత్రులను ఎంపీ సీట్లకు పోటీ పెట్టనుందని సమాచారం. ఈ ఎత్తుగడల్లొ భాగంగా అనకాపల్లికి సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రున్ని పోటీ చేయించాలని పార్టీ భావిస్తోందట. నర్శీపట్నంలో అయ్యన్నకు గ్రాఫ్ తగ్గడం, ఇక్కడ జగన్ పాదయత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో అయ్యన్న బదులుగా వేరే క్యాండిడేట్ ని దించడం ద్వారా ఆ ఫ్యామిలీ నుంచి ఆ అసెంబ్లీని పక్కన పెట్టాలనేది టీడీపీ వ్యూహంలా కనిపిస్తోంది. అదే జరిగితే అయ్యన్న పట్టు నుంచి దశాబ్దాల పాటు ఉన్న నర్శీపట్నం చేజారినట్లే. కీలకమైన శ్రీకాకుళం ఎంపీ సీటుకు ఆ జిల్లా మంత్రి కింజరపు అచ్చెం నాయుడిని నిలబెట్టాలాని బాబు ఆలొచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ రావు యువకుడు, బాగా పనిచేస్తున్నాడు. అందువల్ల ఆయన్ని ఎమ్మెల్యేగా పోటీ చేయించి మంత్రిగా తీసుకుంటే బాగుంటుందని బాబు ఆలోచనగా కనిపిస్తోంది. సీనియర్ గా అచ్చెన్నాయుడు సేవలు డిల్లీకి పరిమితం చేయాలనుకుంటున్నారు.విశాఖకు చెందిన మరో మంత్రి గంటా శ్రీనివాస రావు ని కూడా విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేయమంటున్నట్లు భోగట్టా. గంటా మొదట టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా బరిలో దిగారు. ఆయన ఆ తరువాత నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఇపుడు ఆయన్ని మరో మారు పార్లమెంట్ కు పంపడం ద్వారా జూనియర్లకు మంత్రి చాన్స్ ఇవ్వవచ్చు అన్నది బాబు భావనగా ఉందంటున్నారు. మరి ఈ ముగ్గురు మంత్రులు అసెంబ్లీని వదిలి పార్లమెంట్ కు వెళ్ళేందుకు రెడీగా ఉన్నారో లేదో.చూడాలి. ఏది ఏమైనా వారిని ఒప్పించే ఓర్పూ, నేర్పూ మాత్రం బాబులో ఉన్నాయన్నది వాస్తవం.