పదేళ్లపాటు పవర్‌ఫుల్ రాజకీయం నడిపి హస్తం నేతలకు.. పాపం నాలుగేళ్ల ప్రతిపక్షంలో ఉండటం కష్టంగా మారింది. పైగా.. అధికార పార్టీ తాము ఉన్నంతగా ఉండలేదనేది మరో బెంగ. తొక్కిపట్టి నారతీయటం అంటే.. ఏమిటనేది ప్రత్యక్షంగా చూశారు. అటు ఏపీలో ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలవాల్సిన పరిస్థితుల్లో నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి వేళ పార్టీకు దూరమైన నేతలను బుజ్జగించి.. లాలించి కండువా కప్పి మరీ అక్కున చేర్చుకుంటున్నారు. తెలంగాణలో నాగం, రేవంత్‌రెడ్డి అండ్.. విజయశాంతి ఇలా.. ఎందరో రాహుల్ సమక్షంలో పార్టీ జెండా మోస్తామంటూ వచ్చారు. వీరందరి లక్ష్యం హస్తం రేపు కేంద్రంలో సర్కారు ఏర్పాటుచేస్తే.. తామేకింగ్‌లు. లేకపోతే.. కనీసం ఇలాఖాలో పెత్తనం చేసే పటేళ్లు కావచ్చనే ఆలోచన కూడా. దీంతో బండ్ల గణేష్ వచ్చి నేనూ కాంగ్రెస్‌లోకే అంటే.. ఎంచక్కా అటు రాహుల్ వద్దకు నడిపించారు. నిన్నటి వరకూ ఎర్రజెండా ఎర్రజెండా ఎల్లియల్లో.. అంటూ గళమెత్తిన గద్దర్ అన్న కూడా.. ఇప్పుడు కార్పొరేట్ రాజకీయ కోటరీ హస్తంలోకి చేరిపోయాడు. విమలక్క కూడా రెడీ అంటూ చేరారు. ఎందుకిలా అంటే. మహాకూటమితో అన్నిపార్టీలూ కేసీఆర్‌పై యుద్ధానికి రెడీ అంటున్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే.. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిన సమైఖ్యవాది. ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్‌కు కేసులో చుక్కలు.. అసదుద్దీన్‌కు నక్షత్రాలు చూపిన ధీటైన సీఎం అంటూ విపక్షాలు కూడా తెగ మెచ్చుకున్నాయి. అయితే.. సీఎం పదవికి రాజీనామా చేయటం ద్వారా తాను సమైఖ్యతకు ఎంత కట్టుబడి ఉండాననేది చాటారు. అదే ఊపులో పార్టీ స్థాపించి చెప్పు గుర్తు కూడా సంపాదించారు. అయితే ఎన్నికల బరిలో పోటీచేసినా డిపాజిట్లు కూడా సాధించలేకపోయారు. దీంతో రాజకీయాలకు బైబై అంటూ.. సైలెంట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఏదో సాధారణ వ్యక్తిగా జీవనం ప్రారంభించారు. అటువంటి వేళ.. కిరణ్‌కుమార్ రెడ్డిని మరోసారి హస్తం తన వైపు తిప్పుకుంది. నాలుగైదు నెలల క్రితం కండువాకప్పి నెత్తిన పెట్టుకుంది. దీంతో ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి సీటుకిందకు నీరొచ్చినట్టుగా భయపడ్డారు. దీంతో కిరణకుమార్ మౌనం దాల్చాడు. మా ఇద్దరి మధ్య వైరం లేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చి సైడ్‌కు జరిగారు. ఇప్పుడు ఎన్నికల సమయం.. పైగా ఏపీలోనూ రఘువీరా దూకుడు పెంచారు. తెలంగాణలో తమ పార్టీతో పొత్తుపెట్టుకున్న టీడీపీను వదలట్లేదు. ఇటువంటి సమయంలో కనీసం కిరణ్ బయటకు వస్తే ఊపొస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట. మరి.. కిరణ్ కుమార్‌రెడ్డి స్పందన మాత్రం ఇప్పటికీ సైలెంటే..!!