రాజమండ్రి కవాతులో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పత్రికా ప్రకటనలో జనసేనపై ధ్వజమెత్తారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి కవాతులో పవన్ కళ్యాణ్ ప్రసంగంలో కొత్తదనం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును విమర్శించడం తప్ప అని అన్నారు. రాష్ట్రం నాలుగు ఏళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేంద్రంలో బిజెపి కక్షకట్టి సహాయ నిరాకరణ చేస్తోంది. పట్టుదలతో ఇంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అయినా పవన్ కళ్యాణ్ విమర్శించడం లాలూచి రాజకీయమేనని అన్నారు. జగన్ పైన కోపం లేదంటాడు. జగన్ లక్ష కోట్ల అవినీతి దేవుడికే తెలుసంటాడు. సిబిఐ, ఈడి ఛార్జిషీట్లలో జగన్ అవినీతి రూ.43 వేల కోట్లని గుర్తించాయి. అందులో కొన్ని ఆస్తులను జప్తు చేశాయి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కు తెలియదా? తెలిసినా తెలియనట్లు తప్పించుకుంటున్నాడని అన్నారు. జగన్ అవినీతి తనకు తెలియదంటూ పవన్ కళ్యాణ్ వెనకేసుకు వస్తున్నాడని విమర్శించారు. దేశంలో అవినీతి రహిత రాష్ట్రాలలో ఏపి 3వ స్థానంలో ఉందని సర్వేలే చెప్పాయి, ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అతితక్కువ అనేది పవన్ కళ్యాణ్ కు తెలియదా..? తెలిసి కూడా అవినీతి అంటున్నాడంటే ఎవరితో లాలూచిపడ్డాడో స్పష్టం అవుతోంది. దేశం అంతా రాఫెల్ స్కామ్ పై గగ్గోలు పెడుతోంది. కానీ రాఫెల్ పై పవన్ కళ్యాణ్ మాట్లాడరని అన్నారు. అవినీతిపై పోరాటం అంటే జగన్ పై పోరాడాలి. రాఫెల్ స్కామ్ సూత్రధారి మోదిపై పోరాడాలి. జగన్, మోదిని వదిలేసి చంద్రబాబుపై ఆరోపణలు పవన్ చేస్తున్నారు బిజెపి, వైసిపి, జనసేన లాలూచికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలని ప్రశ్నించారు. నరేంద్రమోది పై మాట్లాడడు, జగన్ పై మాట్లాడడని అన్నారు. రాష్ట్రానికి ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. ముఖ్యమంత్రి కావాలంటే అందరివాడు కావాలి. మీ అన్యయ్య ‘అందరివాడు’ సిన్మా తీశాడు. కానీ వాస్తవంలో కొందరివాడిగానే మిగిలాడు. 18 శాతం ఓట్లకే పరిమితం అయ్యాడు. వాటిని కూడా కాంగ్రెస్ లో కలిపేశారని అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్. పవన్ ప్రచారం చేసినా పాలకొల్లులో అన్నయ్య ఓడిపోయాడు. అందరివాడు అనిపించుకుంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి కాగలరు. కొందరివాడైతే ప్రజాదరణ పొందలేరని యనమల అన్నారు. అందరివాడు కాబట్టే చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ రోజు ప్రజారాజ్యం పెట్టి వైఎస్ గెలుపునకు దోహదపడ్డారు. తరువాత పిఆర్ పిని కాంగ్రెస్ లో కలిపేశారు. ఇప్పుడు ఎవరిని గెలిపించడానికి జనసేన పోటిచేస్తోంది తరువాత ఎవరితో కలిసిపోతుంది..?అనేది ప్రజలకు ముందే పవన్ వివరంగా చెప్పాలని అయన డిమాండ్ చేసారు.. ఎన్నికలు త్వరలోనే వస్తున్నాయి. మీ సత్తా ఏమిటో రేపు వాటిలో చూపించండని అన్నారు.