శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గత నెలలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై కేరళవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. తీర్పు అనంతరం నెలవారి పూజల కోసం అయ్యప్ప సన్నిధానం బుధవారం తెరుచుకోనుండగా, ఎవరైనా మహిళలు శబరిమలకు వచ్చేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అయ్యప్ప భక్త సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటన మరింత అజ్యం పోసేటట్టుగా ఉంది. మహిళలకు ప్రవేశం లేని ఆలయాల్లో ప్రవేశం కోరుతూ, సుప్రీంకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని, పోలీసుల సాయంతో ఆలయాల్లోకి వెళ్లి పూజలు చేసే ఆమె బుధవారం శబరిమలకు వస్తున్నట్టు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాలని, తాను అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు బుధవారం వెళుతున్నానని ఆమె తెలిపారు. అంతేకాదు, తన రక్షణ బాధ్యత పూర్తిగా కేరళ ప్రభుత్వం, పోలీసులదేనని తృప్తి పేర్కొన్నారు. అలాగే కేరళలో జరుగుతున్న ఆందోళనలు గురించి పట్టించుకోబోనని, ఓ వర్గం చేస్తున్న నిరసనలు న్యాయస్థానాల తీర్పులను అడ్డుకోలేవని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, తృప్తి దేశాయ్ ప్రకటనపై కేరళ సంఘాలు మరింతగా మండిపడుతున్నాయి. అమెను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయం వద్దకు వెళ్లనివ్వబోమని పలువురు మహిళలు వ్యాఖ్యానించారు. ఆమెను అడ్డుకునేందుకు ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఆమె ఎక్కడ కాలుపెడితే, అక్కడ అడ్డుకుంటామని, కేరళ మహిళల మనోభావాలను దెబ్బతీయకుండా వెనక్కు వెళ్లిపోవాలని కోరతామని అన్నారు. మాట వినకుంటే తరువాత జరిగే పరిణామాలను ఆమె ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు సుప్రీంతీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే ప్రసక్తే లేదని కేరళ ప్రభుత్వం మంగళవారం తేల్చి చెప్పింది. సుప్రీం తీర్పుపై చర్చించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నేడు ప్రత్యేంగా భేటీ కానుంది. ఈ సమావేశానికి పందళ రాజ వంశీయులు, శబరిమల ఆలయ ప్రధాన పూజారులు సైతం హాజరై తమ అభిప్రాయాన్ని మరోసారి తెలియజేయనున్నారు. శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తోన్న సంప్రదాయాన్ని విరుద్ధంగా వ్యవహరించలేమని ఇప్పటికే వారు స్పష్టం చేశారు. ఆందోళనలు ఉద్ధృతం కావడంతో శాంతి భద్రతలపై కేరళ డీజీపీ అత్యవసర సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు ఎవరైనా దర్శనానికి వస్తే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయని శబరిమల ఆలయ ప్రధాన పూజారి, తంత్రి కందరారు మహేశ్వరారు హెచ్చరించడం విశేషం.