YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

తెలుగువాడి సొత్తు..మాయాబజార్

తెలుగువాడి సొత్తు..మాయాబజార్

శశిరేఖా పరిణయం అని కూడా చెప్పుకునే ‘మాయాబజార్’ ప్రపంచ సినీ చరిత్రలో మేటి చిత్రం అని చెప్పుకోవచ్చు...ఇది కొంత అతిశయంగా అనిపించినా...“ఇది ప్రపంచ చలన చిత్ర చరిత్రకు మా వంతు చేర్పు’ అని తెలుగోడు సగర్వంగా సమర్పించిన అజరామర చిత్రం. మహాభారతంలో జరగని ఒక కల్పిత గాథ ఆధారంగా తెలుగువారు రమణీయంగా అల్లుకున్న కమనీయ కథా చిత్రం.

ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన స్క్రీన్ ప్లే అని ప్రపంచ సినీ దర్శక దార్శనీకులు కొనియాడిన చిత్ర రాజం. ఈ చిత్రం ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27 వ తేదీన విడుదలై అద్భుత విజయం సాదించింది. పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ తెలుగు సినీ అభిమానులకందించిన మరొక అపురూప కళాఖండం. భక్త పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, దొంగరాముడు మొదలగు చిత్రములను రూపొందించిన కె వి రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. భారీ సెట్స్‌తో, దాదాపు 30 లక్షల బడ్జెట్‌తో  విజయ ప్రొడక్షన్స్‌వారు అందించిన చిత్ర రాజం. రచయిత పింగళి నాగేంద్రరావు తస్మదీయులు, దుష్టచతుష్టయం , జియ్యా , రత్న గింబళీ, గిల్పం, శాఖంబరి దేవి ప్రసాదం, వంటి కొత్త పదాలను పరిచయం చేసి, వేసుకో వీరతాడు వంటి సంభాషణలు మనల్ని గిలిగింతలు పెట్టిస్తాయి. "లాహిరి లాహిరి లాహిరిలో" పాటను చూసి తెలుగు సినిమా చరిత్ర లోనే వెన్నెలనింత అందంగా ఇంకెక్కడా చూడలేదు' అనుకున్న వారు ఆ పాటను మండుటెండలో తీశారని తెలుసుకుని తెల్లబోయారు.సినిమా తెలుగునాట క్లాసిక్ స్థాయికి చేరింది. సాధారణ ప్రేక్షకుల నుంచి సినిమారంగ ప్రముఖుల వరకూ ఎందరెందరో మాయాబజార్ తమ అభిమాన చిత్రంగా పేర్కొంటారు సినిమా విడుదలైనప్పుడు విజయా సంస్థ నందమూరి తారక రామారావు నటించిన కృష్ణుని పాత్ర ఆహార్యంతో 40వేల క్యాలెండర్లు ముద్రించి అమ్మారు.

రాష్ట్రమంతటా ఇళ్లలో, షాపుల్లో ఆ క్యాలెండర్లకు ఫ్రేము కట్టించి పెట్టుకున్నారు.ఏదేమైనా రేలంగి కేరక్టర్... ముఖ్యంగా దర్పం, అమాయకత్వం, బింకం, వెర్రితనం... అన్నీ కలసిన అతని సైకాలజీ న భూతో న భవిష్యతి... ముఖ్యంగా లక్ష్మణ కుమారుడి సంక్లిష్టమైన సైకాలజీని గుర్తెరిగి అతన్ని ఈజీగా డీల్ చేయగలిగే నేర్పు శకుని (సిఎస్ ఆర్ ) చూపించడం ఇంకా హైలైట్....ఎన్నో విశేషాలను సొంతం చేసుకున్న మాయాబజార్ తెలుగువాడి సొత్తు.

                                                                                                               - సూర్య ప్రకాష్, సినీ విశ్లేషకులు 

Related Posts