జనసేన పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గోదావరి, గుంటూరు జిల్లా నేతలు, సీనియర్లు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరిపోగా ఇపుడు ఉత్తరాంధ్ర మాజీ ప్రజారాజ్యం నాయకుల వంతు వచ్చిందంటున్నారు. అప్పట్లో అన్నయ్య చిరంజీవి పార్టీలో చేరి చురుకుగా పని చేసిన వారు, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ పడ్డ వారి జాబితాను జనసేన చురుకుగా పరిశీలిస్తోదంట. అలా ఉత్తరాంధ్రలో కొంతమంది నేతలకు గాలం వేసేందుకు తెర వెనక కసరత్తు జరుగుతున్నట్లు భోగట్టా.
ప్రస్తుతం విజయనగరం పట్టణం ఎమ్మెల్యేగా ఉన్న మీసాల గీత పక్క చూపులు చూస్తున్నరని టాక్ నడుస్తోంది. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ లేకపోవడంతో పార్టీ మారైనా పోటీ చేసేందుకు రెడీ అవుతారని అంటున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఓనమాలు దిద్దిన గీత అప్పట్లో మునిసిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల నాటికి ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరి విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 నాటికి టీడీపీలో చేరిన గీత నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ గజపతి రాజు లోక్ సభకు పోటీ చేయడంతో ఎమ్మెల్యే టికెట్ సాధించి గెలిచారు.ఇపుడు మాత్రం సీన్ తారు మారు అవుతోందంటున్నారు. గీతకు వచ్చే ఎన్నికల్లో టికెట్ డౌట్ లో పడిందని ప్రచారం సాగుతోంది. పైగా ఇక్కడ వైసీపీ తరఫున కోలగట్ల వీరభద్రస్వామికి జగన్ టికెట్ ఇచ్చారు. బిగ్ షాట్ లాంటి కోలగట్లతో ఢీ కొట్టి గెలవడం గీత వల్ల కాదని అధినాయకత్వం భావిస్తోందట. అటూ ఇటూ తిరిగి మరో మారు అశోక్ గజపతి రాజునే పోటీ చేయిస్తారని అంటున్నారు. అదే జరిగితే గీత ఖాళీ అయిపోతారు. ఇపుడు అదే గీతను కలవరపెడుతోందట.అందువల్ల గీత ఇపుడు వేరే విధంగా ఆలోచనలు చేస్తున్నారుట. టీడీపీ కనుక హ్యాండ్ ఇస్తే పాత పరిచయాలతో జనసేనలోకి జంప్ చేయాలని ఆమె అనుకుంటున్నట్లుగా సమాచారం. జనసేన సైతం గట్టిక్యాండిడేట్ల కోసం చూస్తోంది. గీత ఎటూ ప్రజారాజ్యంలో పనిచేసి ఒకమారు ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేశారు కాబట్టి ఆమెకు జనసేనలో తీసుకోవడానికి ఇబ్బందులేమీ లేవు. పైగా కాపు సామాజికవర్గానికి చెందిన ఆమెకు రెడ్ కార్పెట్ వేస్తారు కూడా. దాంతో మీసాల గీత దాటడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. మరి అదే జరిగితే అటు కోలగట్ల, ఇటు అశోక్ లాంటి వారి మధ్యన పడి గీత 2009 నాటి పరిస్థితినే ఎదుర్కొంటారా లేక సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలిచి జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకుంటారా అన్నది చూడాల్సి ఉంది