వైఎస్ జగన్ పాదయాత్రలో బహిరంగ సభలు అయితే నిర్వహిస్తున్నారు కానీ అభ్యర్ధులను మాత్రం ప్రకటించడంలేదు. దాంతో ఆశావహులు డీలా పడుతున్నారు. జగన్ మీటింగలకు జనాలను తరలించి తమ బలాన్ని చాటుకుంటున్న నాయకులను కంగు తినిపిస్తూ జగన్ అన్నీ చెప్పి అసలు విషయం మాత్రం వదిలేసి ముందుకు సాగిపోతున్నారు. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం జగన్ పాదయాత్ర సాగుతోంది. ఇక్కడ అడుగు పెడుతూనే జగన్ విజయనగరం టౌన్ అభ్యర్ధిగా కోలగట్ల వీరభద్రస్వామి పేరు ప్రకటించారు.నిజానికి బొత్సకు జగన్ బాగానే గౌరవం ఇస్తున్నారు. దానిని బట్టి జిల్లాలో కనీసం అర డజన్ ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు తన వర్గానికి దక్కుతాయని బొత్స గ్యాంగ్ ఆశపడింది. అలాంటిది జగన్ ఒక్క సీటుకు కూడా పేరు ప్రకటించకపోవడం వెనక ఆయన వ్యూహం ఏమై ఉంటుందన్న చర్చ మొదలైంది. బొత్స వర్గాన్ని జగన్ పక్కన పెడుతున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎస్ కోటలోనే జగన్ అభర్ధిని ప్రకటిస్తారని బొత్స వర్గం ఆశగా ఎదురుచూసింది అక్కడ కడుబండి శ్రీనివాసరావుని ఇంచార్జ్ గా పెట్టడం వెనక బొత్స సోదరుల హస్తం ఉంది. అయితే జగన్ పాదయాత్రలో ఉంటూనే అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. అందుకే అభ్యర్ధుల ప్రకటన విషయంలో ఏ మాత్రం తొందర పడడం లేదు. కడుబండి శ్రీనివాసరావు నిజానికి గజపతినగరం సీటు రేసులో వున్నారు. అక్కడ ఆయన్ని ఎస్ కోటకు పంపించి బొత్స తన సోదరుడు అప్పలనరసయ్యని క్యాండిడేట్ గా సోలోగా డిక్లేర్ చేయించుకోవాలను చూశారు. గజపతినగరంలో అదిరిపోయే మీటింగ్ జరిగింది. తన పేరు ప్రకటిస్తారని అప్పలనరసయ్య ఆశగా చూశారు. కానీ జగన్ ఏమీ మాట్లాడకుండా ప్రసంగం ముగించేయడంతో బొత్స వర్గం షాక్ తింది.బొత్స సత్యనారాయణ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన వర్గం విజయనగరం జిల్లాలో బలంగా ఉంది. జగన్ పాదయాత్రలో వరసగా పేర్లు అందరివీ ప్రకటిస్తారని గట్టిగా అంచనాలు వేసుకున్నారు. తీరా జగన్ ఆ వర్గానికి షాక్ ఇచ్చేల మరో వర్గం నడుపుతున్న కోలగట్ల వీరభద్రస్వామి పేరును తొలిగా ప్రకటించడమే కాదు. అసలు బొత్స వర్గంలో ఇంతవరకూ ఎవరి పేరును డిక్లేర్ చేయకపోవడంతో వారంతా రగిలిపోతున్నారు.జగన్ పాదయాత్రలో అందుతున్న రిపోర్ట్ ను బట్టి ఎక్కడ ఎవరు ఏమిటన్నది కచ్చితమైన అవగాహనకు వచ్చారని దాని ప్రకారమే అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని అంటున్నారు. కాగా తన పేరు ప్రకటించకపోవడం పట్ల కినుక వహించిన అప్పల నరసయ్య అలకపానుపు ఎక్కినట్లుగా భోగట్టా. మరి రేపటి రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.