ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని గుజరాత్ రావలిసిందిగా, గుజరాత్ ముఖ్యమంత్రి ఆహ్వానం పంపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణకు హాజరుకావాలని కోరుతూ గుజరాత్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఆ రాష్ట్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆర్‌సీ ఫల్దు సోమవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందించినట్లు చెప్పారు.గుజరాత్‌లోని నర్మదా నదితీరంలో ఈ నెల 31న జరిగే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడకు చంద్రబాబు వెళ్తారా, ప్రతినిధిని పంపిస్తారా అనేది చూడాల్సి ఉంది. చంద్రబాబు తరుచూ పటేల్ విగ్రహానికి ఇచ్చినన్ని డబ్బులు కూడా అమరావతికి ఇవ్వలేదు అంటూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా గుజరాత్ రాష్ట్రంలో ఈ విగ్రహం ఏర్పాటవుతోంది. దీని ఎత్తు 182 మీటర్లు.. అంటే 600 అడుగులు. చైనాలోని ‘స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ’ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. దీని ఎత్తు 128 మీటర్లు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన ప్రాజెక్టుగా పరిగణిస్తున్న ఈ విగ్రహం తయారీకి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం దాదాపు రూ. 2,990 కోట్లు. ఐక్యతా విగ్రహంగా పిలుస్తున్న దీన్ని అక్టోబర్ 31వ తేదీన మోదీ ఆవిష్కరించనున్నారు. నిర్ణీత గడువులోపు ఈ విగ్రహ తయారీ పనులు ముగించేందుకు 2500 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. చైనా నుంచి వచ్చిన వందల మంది వలస కార్మికులు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు.