కోస్తాంధ్రలో గల తీర ప్రాంతం పరిరక్షణకు 'రక్షణ కవచం'గా పిలవబడే సిఆర్‌జెడ్ ను ఏమార్చేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే రూ.240 కోట్లతో బీచ్ ఫ్రంట్ వ్యూ పేరుతో విశాఖ కోస్టల్ బ్యాటరీ నుంచి రుషికొండ వరకు బీచ్ రహదారి పరిసర ప్రాంతాల్లోనూ, విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు సాగరతీర పరిసర ప్రాంతాల్లోనూ ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి పేరుతో సిఆర్‌జెడ్ నిబంధనల ఉల్లంఘనకు వ్యూహరచన చేశారు. దీనిపై ఇటీవల విశాఖలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో పట్టణ వాసులు, ప్రజాసంఘాలు వ్యతి రకించాయి. అయినా ఆగని ప్రభుత్వం తాజాగా సిఆర్‌జెడ్ నిబంధనలను జారవిడిచి మంత్రులు, అధికార, రాజకీయ ప్రముఖుల ఆశీస్సులతో నిబంధనలకు విరుద్ధంగా స్థలాలు కొనుక్కుని, భవంతులు నిర్మించుకున్నవారికి అండగా నిలిచే ప్రక్రియకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అభివృద్ధి కార్యక్రమాలకు ముందస్తు ప్రణాళిక అంటూ దీనికి పేరు పెట్టడం విశేషం.సముద్రపు ఆటుపోట్లకు 500 మీటర్ల దూరంలోపు ఎలాంటి భవంతులు ఉండకూడదని సిఆర్‌జెడ్-1 చెబుతుండగా, సిఆర్‌జెడ్-2 మాత్రం నగర పరిధిలో ఉన్న వాటికి ఈ నిబంధనకు మినహాయింపు ఇస్తోంది. సిఆర్‌జెడ్-3 ప్రకారం విశాఖ నగరానికి ఆనుకుని1985-1991 మధ్య జరిపిన కొలతలు, సర్వే చెబుతున్న దాన్నిబట్టి 9 మీటర్లు దాటి పెద్ద భవంతులకు అవకాశం లేదు. సిఆర్‌జెడ్ -3 ప్రకారం 100 గజాలు ఒక వ్యక్తికి స్థలం ఉంటే అందులో 30 గజాలు మాత్రమే కట్టాలి. మిగతా దాన్ని ఖాళీగా ఉంచాలి. కాపులుప్పాడ మొదలుకుని కైలాసగిరి వరకూ ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా వేల ఎకరాలు ఇలా పెద్దల పాలయ్యాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ భూములున్న పెత్తందారులు, రియల్‌ఎస్టేట్ అధిపతుల ఒత్తిడి ప్రభుత్వంపై పడింది. దీంతో సిఆర్‌జెడ్ 3 నిబంధనను సిఆర్‌జెడ్-2లోకి మార్చే కుట్ర తాజాగా జరుగుతోంది. దీనికి అధికార పార్టీ పెద్దల అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి.