విశాఖపట్టణం జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన గాజువాక నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. తెలంగాణ మాదిరిగా ఎపిలో కూడా చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి మంతనాలు సాగిస్తున్నట్లు స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు. గాజువాక నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఆ ఎన్నికల్లో చిరంజీవి ప్రభావం కారణంగా చింతలపూడి వెంకటరామయ్య గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. అప్పటికే ఒకసారి ఎంపీగా ఓటమి చెందిన పల్లాపై గాజువాక ప్రజలు సానుభూతి కనబరిచి గెలిపించారన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో టిడిపికి గాజువాకలో ఓట్లు శాతం తగ్గవచ్చునని ఈపాటికే చంద్రబాబుకు సమాచారం అందింది. అదే నిజమైతే 2019లో ఈ సీటును కోల్పోక తప్పదని ఆయన భావించారు. సుబ్బిరామిరెడ్డిని ఎంపీగా బరిలోకి దించితే గాజువాక నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక తరగతి ఓట్లను టిడిపి ఎమ్మెల్యే వైపునకు తిప్పుకోవచ్చన్నది బాబు ఆలోచనగా ఉందని పలువురు చెబుతున్నారు. విశాఖ పార్లమెంట్ స్థానాన్ని రాజ్యసభ సభ్యులు టి.సుబ్బిరామరెడ్డికి కేటాయించి టిడిపి, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సుబ్బిరామిరెడ్డి తన వ్యాపార లావాదేవీల నిమిత్తం చంద్రబాబుతో సఖ్యతగానే మెలుగుతున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో టిడిపిపై ఒక్క విమర్శ కూడా చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయాన్ని కూడా కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ సామాజిక తరగతికి చెందిన వ్యక్తి. నిన్న మొన్నటి వరకూ కాపు, యాదవ సామాజిక తరగతుల ఓట్లతో ఆయన గెలుస్తారని అంతా అనుకున్నారు. అయితే టిడిపిలో ఉన్న యాదవ సామాజిక తరగతికి చెందిన కోన తాతారావు ఈ మధ్య జనసేనలో చేరారు. మరోపక్క కాపు సామాజిక తరగతికి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య కూడా ఇదే పార్టీలో చేరారు. ఈ పరిణామాలతో గతంలో ఎమ్మెల్యే పల్లాకు కలిసి వచ్చిన కాపు, యాదవ సామాజిక తరగతుల ఓట్లు చీలే అవకాశముంది. ఈ పరిణామాన్ని చంద్రబాబు గుర్తించారు. మరోవైపు వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డికి సంబంధించిన రెడ్డి సామాజిక తరగతికి నియోజక వర్గంలో 16 వేల ఓట్లు ఉన్నాయి. అవి ఆయనకే పోలవుతాయన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. సుబ్బిరామిరెడ్డిని ఎంపీగా నిలబెడితే ఆ ఓట్లలో టిడిపికి కొన్ని పడి ఎమ్మెల్యే సీటును మళ్లీ నిలబెట్టుకోవచ్చనే ఆలోచన బాబు బుర్రలో ఉంది. ఈ విధంగా కాపు, యాదవ ఓటింగ్ తగ్గినా రెడ్డి సామాజిక తరగతి ఓటింగ్‌ను పెంచుకుని గెలవొచ్చని భావిస్తున్నారు. సుబ్బిరామిరెడ్డి ఆర్థికంగానూ బలమైన వ్యక్తి కావడంతో నియోజకవర్గంలో మురికివాడల ఓట్లును తనవైపు తిప్పుకొనే సత్తా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ చర్చ నియోజకవర్గంలో ప్రస్తుతం జోరుగా సాగుతోంది.