కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలూరు మండలం పెద్ద హోతూరు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఆగి ఉన్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులందరూ కర్నూలు పాతబస్తీ వాసులు. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వీరంతా కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో సుమారు 21మందికి పైగా ఉన్నట్టు సమాచారం. మరణించిన వారిలో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు మృతుల్లో ఖాజా (26), హుస్సేన్, ఆసీఫ్, హస్ర, షేక్ మెహక్, ఫాతీమా వున్నారు. షేక్ మక్బుల్, రఫీ, షేక్ మహమ్మద్, షబానా, హసీనా, అక్బర్ బీ, మాబున్నీసా మరో కొందరికి గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎంపీ టీజీ వెంకటేశ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.20వేల చొప్పున టీజీ వెంకటేశ్ ఆర్థిక సహాయం చేశారు. బాధితులను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపినాథ్ జెట్టి పరామర్శించారు.