తిత్లీ తుపాను బాదితులకు సహాయక చర్యలకు ఆటంకం కలిగించవద్దని, అలా చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఉద్దానంలోని పలాస, ఇతర ప్రాంతాల్లో రేయింబవళ్లు శ్రమిస్తుంటే కొందరు కావాలనే రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని.. అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. చేతనైతే సాయం చేయాలి కానీ రెచ్చగొట్టి అడ్డంకులు సృష్టించవద్దంటూ చంద్రబాబు హితవు పలికారు.తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి, జీడి, మామిడి, అరటి పంటలు దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడికక్కడ విద్యుత్ స్తంబాలు కూలిపోవడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది క్షేత్రస్థాయిలో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లాలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.