కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు. ఏసియన్ ఏజ్‌లో ఎడిటర్‌గా పని చేసిన సమయంలో అక్బర్ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ పలువురు మహిళా పాత్రికేయులు ఆయనపై ఆరోపణలు చేశారు. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా పాత్రికేయురాలు ప్రియా రమణి తొలిసారిగా అక్బర్‌పై ఆరోపణలు చేశారు. ఆమె తర్వాత దాదాపు 15 మంది మహిళలు ఇదే విధంగా ఆయనపై ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఇవన్నీ నిరాధారమైనవని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కావాలనే తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లు ఆయన తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలోనే తనపై ఆరోపణలు చేసిన ప్రియా రమణిపై అక్బర్ చట్టపరంగా చర్యలకు ఉపక్రమించారు. ఆమెపై పటియాలా న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాడేందుకే ఆయన పదవికి రాజీనామా చేశారంటూ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.