రబీ సీజన్ వచ్చేసింది. కర్నూలులోని పలు ప్రాంతాల్లో రబీకి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు రైతులు. ఇంతవరకూ బాగానే ఉన్నా సాగునీటి విషయమై పలువురిలో ఆందోళన నెలకొంది. వరుణుడు జాడలేకపోవడమే దీనికి కారణం. వర్షాలు లేకుంటే ప్రాజెక్టుల నుంచి వచ్చే సాగునీరు లేదా బోర్లపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఈ సంగతి పక్కనపెడితే ఈ రబీలోనూ ప్రతికూల వాతావరణం పంటలను ప్రభావితం చేస్తుందేమోననే ఆందోళన పలువురి రైతుల్లో నెలకొంది. ఎందుకంటే గతేడాదిలోనూ సీజన్‌లో కురవాల్సిన వానలు ఏడాది చివర్లో పడ్డాయి. దీంతో పంటలకు నష్టం వాటిల్లింది. తెగుళ్లు కూడా విజృంభించాయి. ఫలితంగా దిగుబడులు ప్రభావితమయ్యాయి. కష్టానికి తగ్గ ఫలం రైతులకు దక్కలేదు. జిల్లాలో సాగు విస్తీర్ణం అధికమే. వరితో పాటూ ఇతర ఆహార ధాన్యాల పంటలను విరివిగానే పండిస్తారు రైతులు. వాణిజ్య పంటలనూ పండించేవారు ఎక్కువే. అయితే పంటలు ఆరోగ్యంగా ఎదగడానికి వర్షపాతం కూడా దోహదం చేస్తుంది. కానీ కొంతకాలంగా ఆ పరిస్థితే లేకుండా ఉంది. జిల్లాలో ఆశించిన వర్షపాతం లేకపోవడం సమస్యాత్మకంగా మారింది.
వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పలువురు రైతుల్లో ఆందోళన నెలకొంది. అప్పోసప్పో చేసి.. పెట్టుబడులు భారీగానే పెట్టి పంటలు వేసుకున్నా చివరికి దిగుబడి ఎలా ఉంటుందన్నది వారిని వేధిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పటికే ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం కొంత తగ్గిందని అంటున్నారు. రబీలోనూ ఇదే పరిస్థితి ఉంటే ఆహార ధాన్యాల దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. వీరి వాదనకు తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా లక్ష్యానికి అనుగుణంగా ఆహార ధాన్యాలను సేకరించలేకపోయినట్లు కొన్ని వారాల క్రితమే వార్తలొచ్చాయి. ఖరీఫ్‌లోనే ఈ ఎఫెక్ట్ కనిపించదని పలువురు స్పష్టంచేశారు కూడా. ఆహారోత్పత్తులు తగ్గిపోతే కష్టమే. ఎందుకంటే దిగుమతులపై ఆధారపడాల్సి ఉంది. రాష్ట్రమే పెద్ద మొత్తంలో నిల్వలు సృష్టించుకుంటే ప్రజలకు సరిపడా ఆహారం అందుబాటులో ఉండడమే కాకుండా ఎగుమతులూ చేయగల స్థితిలో ఉంటుంది. అయితే ప్రతికూల వాతావరణం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు అంటున్నారు. ఇక నిపుణులైతే నీటి ఖర్చు ఎక్కువగా లేని పద్ధతుల ద్వారా పంటలు పండిస్తే మంచిదని రైతులకు సూచిస్తున్నారు.