మారుతున్న జీవనశైలికి తగ్గట్లుగానే ప్రజల ప్రాధామ్యాలు మారాయి. ప్రధానంగా వాహనాల విషయంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది కార్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. వివిధ పనుల కోసం కార్లలోనే ప్రయాణిస్తూ చక్కబెట్టుకుంటున్నారు. కార్ల వినియోగం పెరిగినట్లే డ్రైవింగ్ నేర్చుకునే వారి సంఖ్యా అధికమైంది. ఈ క్రమంలోనే కర్నూలులో డ్రైవింగ్ స్కూల్స్‌కు ఆదరణ పెరిగింది. దీంతో పలువురు డ్రైవింగ్ స్కూల్స్ తెరిచి శిక్షణనిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. కొన్ని స్కూల్స్ తీరుపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవింగ్ నేర్చుకునే వారి నుంచి అధికమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని వసూళ్లపై నియంత్రణ కొరవడిందని కొందరు అంటున్నారు. సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఫీజు దందాపై దృష్టి సారించాలని కోరుతున్నారు. వాస్తవానికి కర్నూలు జిల్లాలో కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. యువతలో ఈ ఆసక్తి మరింత అధికంగా ఉంది. కారు నడపాలన్న తపనతో వారు ఫీజు ఎంత ఉన్నా చెల్లించడానికి వెనకాడ్డంలేదు.
ప్రజల ఆసక్తినే పలు డ్రైవింగ్ స్కూల్స్ క్యాష్ చేసుకుంటూ అధికమొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నట్లు పలువురు అంటున్నారు. ఇదిలాఉంటే ఉంటే ప్రమాణాలు, నిబంధనలు పాటించడంలోనూ కొన్ని స్కూల్స్ ఉదాసీనంగా ఉంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవింగ్ స్కూల్స్ విధింగా పాటించాల్సిన నియమాలను ప్రభుత్వం రూపొందించింది. దీనికోసం జిఒ కూడా ఉంది. రూల్స్ ప్రకారం డ్రైవింగ్ స్కూళ్లలో సొంత వాహనాలను ఉపయోగించరాదు. రవాణా వాహనాలనే వాడాలి. అంతేకాక డ్రైవింగ్ స్కూల్స్‌పై ఆర్‌టిఎ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. కానీ ఈ విషయంలో వారు వెనకడబడ్డారు. మరోవైపు డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు ఒక వాహనానికి అనుమతి తీసుకుని అదనంగా రెండు, మూడు కార్లను శిక్షణకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇక డ్రైవింగ్ నేర్చుకునే వారికి రహదారి భద్రతకు సంబంధించి విషయాలపై అవగాహన కల్పించడమూ సరిగా సాగడంలేదన్న విమర్శలున్నాయి. మొత్తంగా కొన్ని స్కూళ్లు ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్లుగా లేవని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత విభాగం అధికారులు స్పందించి డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహణపై దృష్టి సారించి రూల్స్ ప్రకారమే అంతా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.