YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రోజా కు స్థాన భ్రంశం తప్పదా

 రోజా కు  స్థాన భ్రంశం  తప్పదా
ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గం నుంచి తిరిగి పోటీ చేయాలనుకుంటున్న నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాను సెంటిమెంట్ సెగలు చుట్టుముడుతున్నాయి. ఆమె తిరిగి ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఎంతో ధీమాతో వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆమెకు పోటీ చేసే అవకాశాన్ని ‘జగన్‌’ కల్పించరని స్థానిక నేతలు అంటున్నారు. ఆమెకు ఎదురైన సెంటిమెంట్‌ కారణంగా తిరిగి ఆమెను ఎంపిచేసే పరిస్థితులు లేవని స్థానిక నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ సెంటిమెంట్ రహస్యం ఏమిటనేది కూడా వారు వివరిస్తున్నారు. గతంలో రోజా రెండు సార్లు ఇక్కడి నుంచి టిడిపి తరపున పోటీ చేసి ఓడిపోవడంతో ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే మూడోసారి నగరి నుంచి ఆమె పోటీ చేసి, బొటాబొటీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే అప్పుడు కూడా వైకాపా అధికారంలోకి రాలేకపోయింది. ఒకవేళ ఆమెకు తిరిగి నగరి సీటు ఇస్తే, ఒకవేళ ఆమె గెలిస్తే… అప్పుడు వైకాపా అధికారంలోకి రాదని స్థానిక నేతలు సెంటిమెంటు లెక్కలువేసిమరి చెబుతున్నారు. అందుకే ఆమెకు నగరి నియోజకవర్గం టిక్కెట్టు ఇవ్వడం జగన్ కు మంచిది కాదని సూచిస్తున్నారు. కాగా ప్రజారాజ్యం వల్లే తాను రెండు సార్లు ఓడిపోయానని రోజా చెబుతుంటారు. అలాగే 2014 ఎన్నికల్లో గాలిమద్దు కృష్ణమనాయుడును ఎదుర్కొని తాను విజయం సాధించిన విషయాన్ని మరిచిపోయారని ఆమె వాపోతున్నారట. అయినా సెంటిమెంట్‌తో ప్రతీదానికీ తనను ముడిపెట్టడం భావ్యం కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.2014 ఎన్నికల్లో పలువురు వైసీపీ నేతలు విజయం సాధిస్తారని పార్టీ అధినేత జగన్‌భావించినప్పటికీ అందులో కొందరు ఓడిపోయిన విషయాన్ని రోజా గుర్తు చేస్తున్నారని బోగట్టా. ఇటువంటి సెంటిమెట్లతో తనకు టిక్కెట్‌ ఇవ్వకుండా అడ్డుకునేందుకు కొంత మంది స్థానిక నేతలు కుట్రపన్నుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు, దీనికి తోడు రాష్ట్ర స్థాయి నాయకులు సైతం ఇటువంటి ప్రచారాలు సాగిస్తున్నారని రోజా మండిపడుతున్నారని సమాచారం. మరోవైపు రోజా జనసేన అధినే పవన్‌ సోదరుడు నాగబాబు సహాయంతో ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారనే వార్తలు వినిపించాయి. అయితే ఆమె ఈ ఊహాగానాలను కొట్టిపారేశారు. అయితే నగరి నుంచి ఆమెకు వైకాపా తరపున టిక్కెట్ లభించకపోతే ఆమె జనసేనలో చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికితోడు ఎమ్మెల్యే రోజా షూటింగ్‌ల పేరుతో అధిక సమయాన్ని చెన్నై, హైదరాబాద్‌లలో గడుపుతున్నారని ఆమె వ్యతిరేక వర్గీయులు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ఫిర్యాదు చేసినట్లు భోగట్టా. అలాగే రోజాకు ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉన్నాకూడా, నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడంతో ఆమెపై పార్టీలోని కొంత మంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రోజాకు నగరి టిక్కెట్ దక్కడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముందుముందు ఏం జరగనుందో వేచిచూడాల్సిందే మరి!

Related Posts