ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా నేతల వద్ద ముక్కుసూటిగా వ్యవహరిస్తూ తన ప్రణాళికను జగన్ పక్కగా అమలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రత్యేకించి ఎన్నికలు తరుముకొస్తున్న ప్రస్తుత తరుణంలో జగన్ అభ్యర్థుల ఖరారు విషయంలో ముమ్మర కసరత్తు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపద్యంలో వ్యక్తులను చూసి, లెక్కలు వేయకుండా టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్.. నాయకులతో తేల్చిచెబుతున్నారట. ఒకవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు జనసేన అథినేత పవన్ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపధ్యంలో వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే తన వ్యూహాలకు పదును పెడుతున్నారని తెలుస్తోంది. పార్ఠీ బలోపేతం దిశగా దృష్టి సారిస్తూ, రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంతో జగన్ తలమునకలయ్యారని సమాచారం.పోటీకి సిద్దమవుతున్న నేతలకు సంబంధించి తనకు వచ్చిన రిపోర్టులు, సర్వేల ఆధారంగానే జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం. నేతలలో ఎవరైనా ఓడిపోతారని, వారికి టికెట్ ఇస్తే ఇబ్బంది ఏర్పడుతుందనే విధంగా రిపోర్టులు వచ్చిన పక్షంలో జగన్ వారిని నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో జగన్ తనవారు అనే మొహమాటానికి ఏమాత్రం తలొగ్గడం లేదని తెలుస్తోంది. ఈ విధమైన జగన్ వ్యవహార శైలితో జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నవారు కూడా టికెట్లు కోల్పోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. వైఎస్ఆర్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి జగన్ కు సన్నిహితునిగా పేరొందారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు.జగన్ మోహన్ రెడ్డి లేళ్లకు టిక్కెట్ ఇచ్చేదిలేని స్పష్టం చేశారని తెలుస్తోంది. ఈ విధమైన జాబితాలో మరి కొంతమంది నేతలు కూడా ఉన్నట్టు సమాచారం. వీరిలో ఆళ్ల వంటి సిట్టింగులకు కూడా జగన్ నో అని చెబుతున్నారని భోగట్టా. జగన్… నియోజకవర్గ పరిస్ధితులను పరిగణలోకి తీసుకుని, అక్కడ నెగ్గగలిగేవారికి మాత్రమే టికెట్ ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మొహమాటానికిలోనై కొన్ని సీట్లను కోల్సోయిన విషయాన్ని జగన్ గుర్తు చేసుకుంటున్నారట. అందుకే ఈ సారి అటువంటి అవకాశానికి తావులేకుండా పక్కగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలావుంగా జగన్ మరో విషయంలో అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. గతంలో జగన్ సొంత పార్టీ ఏర్పాటుచేసి, 18 ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలు తీసుకొచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఓట్ల తొలగింపునకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే చేస్తున్నట్టు ఉందని వైఎస్ఆర్ సీసీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై జగన్ పార్టీ ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రతి నియోజకవర్గంలోనూ తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారని జగన్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఓటర్ల జాబితా పరిశీలస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని జగన్ సూచించినట్లు సమాచారం.