జనసేనకు గట్టిగా సీట్లు దక్కే రెండు జిల్లాల పట్టు ఏ మాత్రం వదలకూడదని ఆ పార్టీ అధినేత డిసైడ్ అయ్యారు. అందుకే పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు నెలరోజుల పాటు పర్యటించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాపైనా అదే ఫోకస్ పెట్టనున్నారు పవన్. దసరా పండగ ముగిసిన తర్వాత నెలరోజులపాటు తూర్పులోనే మకాం పెట్టేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి కేంద్రంగానే పవన్ జిల్లాలోని అన్ని ప్రాంతాలు పర్యటించేందుకు జనసేన కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రాజమండ్రి కాతేరు వద్ద కల్యాణ మండపాన్ని కార్యక్షేత్రం చేసుకుని తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు చుట్టేస్తారు పవన్.ఏపీలో కీలకమైన తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ 3 పార్లమెంట్ నియోజకవర్గాలు వున్నాయి. గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు నాలుగు నియోజకవర్గాలను మాత్రమే చిరు పార్టీ గెలిచింది. మరో నాలుగు నియోజకవర్గాలు స్వల్ప తేడాతో చేజార్చుకుంది. ఈ రికార్డ్ పరిశీలించిన పవన్ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలపై కసరత్తు చేస్తున్నారు. బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా గతంలో తన అన్న పార్టీ కన్నా అత్యధిక స్థానాలు సాధించి తీరాలన్నది పవన్ వ్యూహం. దీని కోసం గట్టి హోమ్ వర్క్ చేయాలిసి ఉంటుంది. కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటు ఇతర వర్గాలను కూడా పవన్ ఆకట్టుకోవాల్సి ఉంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాల్సి ఉంది. అందుకే జిల్లాలో నెలరోజుల పాటు మకాం వేసి వీలైనన్ని ఎక్కువ సీట్లు జనసేన సాధించే స్కెచ్ సిద్ధం చేసే పనిలో పవన్ వున్నారు. ఇటీవల ఒక జాతీయ ఛానెల్ వైసిపి కి 21 పార్లమెంట్ స్థానాలు ఖాయమని తేల్చడంతో ఆ లెక్కలను మార్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు జనసేనాని.