శబరిమల ఆలయం వద్ద ఆందోళన కొనసాగుతూనే ఉంది. తీర్పు వెలువరించాక మొదటిసారి ఆలయం తెరిచిన మూడోరోజూ అదే పరిస్థితి నెలకొంది. ఆందోళనల మధ్యే ఓ మహిళా జర్నలిస్టు శిరస్త్రాణం ధరించి దేవుడి సన్నిధానాన్ని చేరుకునేందుకు ప్రయత్నించారు. ఈమెకు 300 మంది పోలీసులు బందోబస్తుగా వచ్చారు. మరో మహిళ అయ్యప్ప మాల ధరించి ఇరుముడితో ఆలయాన్ని చేరుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఇద్దరూ ప్రధాన ఆలయానికి 4.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబ క్యాంపు నుంచి గురువారం బయలు దేరారు.‘‘మేం ఇక్కడికి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికే వచ్చాం. నేను కూడా అయ్యప్ప భక్తుణ్నే. మహిళలకు దేవుణ్ని దర్శించుకునే హక్కు ఉంది.’’ అని మహిళలకు రక్షణ కల్పించిన పోలీసు బృందానికి నాయకత్వం వహించిన ఇన్స్‌పెక్టర్ జనరల్ శ్రీజిత్ అన్నారు. గురువారం 300 మంది పోలీసులు బందోబస్తుగా 5 కిలోమీటర్ల దూరం పొడవైన కొండను ఎక్కి ఆలయం వద్దకు చేరుకున్న ఓ మహిళా జర్నలిస్టు సహా మరో మహిళ తాము తిరిగి వెళ్లిపోయేందుకు అంగీకరించారు. గర్భగుడిలోకి వెళ్లే ముందు ఉన్న 18 మెట్ల దారికి 500 మీటర్ల దూరం వరకూ వచ్చిన మహిళా భక్తులు.. నిరసనకారుల ఆందోళనల నేపథ్యంలో వెనుదిరిగేందుకు ఒప్పుకొన్నారు. స్వామివారికి పూజలు ఆపేది లేదని, అయితే మహిళలు మాత్రం లోపలికి రాకూడదని ప్రధాన పూజారి తేల్చి చెప్పారు. మెట్లదారిలో పదుల సంఖ్యలో ఆలయ పూజారులు కూర్చొని భజనలు చేస్తూ ‘మహిళలను అనుమతించి.. ఆలయ ఆచారాలు మంటకలపొద్దు’ అంటూ నినాదాలు చేశారు. ‘‘ఆలయంలోకి ప్రవేశించాలనుకొనే అసలైన మహిళా భక్తులకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తుంది. కానీ, తమను తాము నిరూపించుకునేందుకు మహిళా నిరసనకారులు ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయకూడదు.’’ అని మంత్రి కదంకపల్లి సురేంద్రన్ తెలిపారు.ఆలయానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిలక్కల్, 4.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబ బేస్ క్యాంపుల వద్ద పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, ఆందోళనకారులు మోహరించి మహిళా భక్తులను అనుమతించడం లేదు. ‘‘మేం శబరిమలను కాపాడుతున్నాం’’ అంటూ నినాదాలు చేస్తున్నారు. గురువారం ఆలయాన్ని చేరుకునేందుకు ప్రయత్నించిన న్యూయార్క్ టైమ్స్ పత్రికకు చెందిన మహిళా జర్నలిస్టును అడ్డుకున్నారు. మరోవైపు శబరిమల వెళ్లే మహిళా భక్తులను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తేల్చి చెప్పారు.