వెస్టిండీస్‌తో గౌహతి వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత క్రికెటర్లు.. శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలెట్టారు. ఆసియా కప్ తర్వాత ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. కెప్టెన్ కోహ్లి, ఓపెనర్ కేఎల్ రాహుల్, ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఆదివారం మధ్యాహ్నం 1:30 నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో సమష్టిగా రాణించిన భారత్ జట్టు 2-0తో సిరీస్‌ని చేజిక్కించుకుంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నెం.1 స్థానంలో కొనసాగుతున్న టీమిండియాకి ఏ దశలోనూ కరీబియన్ టీమ్ పోటీనివ్వలేకపోయింది. కనీసం ఐదు వన్డేల సిరీస్‌లోనైనా పోటీనిస్తుందా..? అంటే డౌటేనని సమాధానాలు వినిపిస్తున్నాయి. క్రిస్‌గేల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, ఎవిన్ లూయిస్ లాంటి హిట్టర్లు జట్టులో లేకపోవడంతో వెస్టిండీస్ బలహీనంగా కనిపిస్తోంది.