బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు శుక్రవారం మరోసారి టీడీపీపై ఆరోపణలు చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రంగా స్పందించారు. సీఎం సీఎం రమేశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడుతున్నారంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం రమేష్‌ను చంద్రబాబు కాపాడటమేంటని నిలదీశారు. సీఎం రమేష్ తప్పు చేస్తే నిరూపించాలని, ఇతరుల అవినీతి గురించి మాట్లాడేముందు బీజేపీ నేతలు తమపై తాము సీబీఐ విచారణ వేయించుకోవాలని సవాల్ విసిరారు. అతిపెద్ద అవినీతిపరుడైన కన్నా లక్ష్మీనారాయణపై సీబీఐ విచారణ జరిపించాలన్న బుద్ధా, మీ ఉడత ఊపులకు బెదిరిపోయేవారు ఇక్కడ ఎవరూ లేరని, బీజేపీ నేతలు పది మాట్లంటే, మా వాళ్లతో వంద మాట్లాడిస్తానని హెచ్చరించారు. రాజకీయంగా మాట్లాడితే మేము రాజకీయంగా మాట్లాడుతాం... వ్యక్తిగతంగా దూషిస్తే మేం కూడా అదే విధంగా మాట్లాడతామని బుద్దా ఉద్ఘాటించారు. తమ అధినేత చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని... ఇది అంత ఆషామాషీ విషయం కాదని అన్నారు. కన్నా, జీవీఎల్‌లు రాజకీయాలను విలువలు లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు, అవినీతి గురించి కన్నా, జీవీఎల్ మాట్లాడటం విచిత్రంగా ఉందని, మీరు చేసే ఆరోపణల్లో ఒకటైనా నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. తెల్లారి లేచింది మొదలు చంద్రబాబు జపం తప్ప మరో పనిలేదని ఎద్దేవా చేశారు. ‘జీవీఎల్ జాగ్రత్త.. మంత్రి నారా లోకేష్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ నాలుక కోస్తా. కావాలంటే కేసు పెట్టుకో. పిచ్చిపిచ్చి వేషాలు వేయ్యెద్దు.. నువ్వో పోరంబోకువి. దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాంటి వ్యక్తిపై నిందలు వేస్తావా? చెమడాలు ఒలుస్తా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు జీవీఎల్ మాట్లాడుతూ... సీఎం రమేష్ తన సొంత కంపెనీల్లోనే తప్పుడు లెక్కలు చూపించారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా పద్దుల కమిటీలో సభ్యుడైన రమేష్ దేశానికి సంబంధించి ఏం లెక్కలు చూస్తారని విమర్శించారు. రూ. 100 కోట్లను దారి మళ్లించిన సీఎం రమేశ్‌ను, పీఏసీ నుంచి సీఎం చంద్రబాబు వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే... పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి తానే ఫిర్యాదు చేస్తానని, రమేశ్ లాంటి వ్యక్తి పీఏసీలో ఉండటం దారుణమని అన్నారు