తిరుమలలో కాంట్రాక్టు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. సామాన్య భక్తులకు కేటాయించే లడ్డూ టోకెన్లలో సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. భక్తుల ముసుగులో 16వేల లడ్డూలను పక్కదారి పట్టించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, ఒకేసారి భారీగా లడ్డూలు మాయం కావడంతో తితిదే నిఘా విభాగం రంగంలోకి దిగింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతోంది.తిరుమల లడ్డూకు అత్యంత ప్రాధాన్యం ఉంది. శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చిన ప్రతి భక్తుడూ లడ్డూ ప్రసాదం తీసుకొనే తిరిగివెళ్తారు. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో గరుడ సేవ రోజున లడ్డూ కేంద్రాల్లో ఈ అక్రమాలు చోటుచేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. గరుడ సేవ రోజున తిరుమలకు సుమారు 4లక్షల మంది భక్తులు తిరుమల గిరులకు చేరుకున్న నేపథ్యంలో స్వామి వారి మూలవిరాట్ దర్శనం, ఉత్సవ విగ్రహాల దర్శనానికి తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. దర్శనంపూర్తి చేసుకొని బయటకు వచ్చే భక్తులు లడ్డూలు తీసుకొనే సమయంలో లడ్డూ టోకెన్లు స్కాన్ కాకపోవడంతో వారికి ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో అవి స్కాన్‌కాకపోయినా.. టోకెన్లు ఇచ్చిన వారికి లడ్డూలు ఇవ్వాలని అప్పటికప్పుడు తితిదే ఆదేశాలు జారీచేసింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు భారీగా లడ్డూలను నొక్కేసినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 16వేల లడ్డూలే దారిమళ్లాయని గుర్తించినప్పటికీ.. గరుడ సేవ జరిగిన రోజు నుంచి నుడు చక్రస్నానం వరకు లడ్డూ కౌంటర్లలో ఎన్ని లడ్డూలు విక్రయం జరిగాయి? వీటిలో ఎలాంటి అక్రమాలైనా జరిగాయ? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.