YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

                                            సర్గ-61

                                     శునస్సేపోఖ్యానం

 "ఇలా అందరూ వెళ్లిపోగానే, తనింతవరకు తపస్సు చేస్తున్న వనంలో విఘ్నాలు కలుగుతున్నాయని, ఆ ప్రదేశాన్ని వదిలి మరింకెక్కడికైనా పోతానని అక్కడున్న వారితో అంటాడువిశ్వామిత్రుడు. ఏ దిక్కుకు పోతే బాగుంటుందని ఆలోచించి, విశాలమైన పడమటిదిక్కున మంచివనాలు, పుష్కరం వున్నందువల్ల, తీవ్రమైన తపస్సు చేయడానికి అక్కడకు పోతే తపస్సిద్ధికలుగుతుందని భావిస్తాడు. త్వరగా అక్కడకు పోవాలని, పోయి కేవలం ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, భయంకరమైన తపస్సు చేయాలనీ, అలా చేయడంద్వారా తపస్సిద్ధన్నాకలగాలి-లేదా-మరణమన్నా రావాలి, అని నిశ్చయించుకుంటాడు. ఉత్కృష్ట మార్గంలో, ఇతరులకు కనీసం అనుకోడానికైనా సాధ్యపడని, అతిగొప్పదైన-కఠినమైన నిష్ఠలతో తపస్సు చేయడం ఆరంభించాడు విశ్వామిత్రుడు”.
“విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న రోజుల్లోనే, అయోధ్యా నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. మనువు మునిమనుమడు, నభగుడి మనుమడు, నాభాగుడి కొడుకైన అంబరీషుడు పెద్దల మన్ననలుపొందేవిధంగా మాట్లాడుతాడని, క్రోధాన్ని జయించినవాడని, శ్రేష్ఠమైన న్యాయ మార్గంలో దోషాలను జయించినవాడని, సద్గుణాలే భూషణాలుగా కలవాడని, రాజశ్రేష్టుడనీ ప్రసిద్ధికెక్కాడు. అలాంటి అంబరీషుడు ఒక యాగాన్ని చేయాలని అనుకొని, చేస్తున్న సమయంలో, ఇంద్రుడు యజ్ఞ పశువును దొంగిలించాడు. యజ్ఞ పశువు పోతే, పోకుండా రక్షించుకోలేక పోతే, యజ్ఞాన్ని చేసేవాడికి దోషం తగులుందని చెప్పాడు ఋత్విజుడు. యజ్ఞపశువునన్నాతెమ్మని, దొరక్కపోతే యజ్ఞం కొరకు బలి కావడానికి ఒక మనిషినైనా తెమ్మని అంబరీషుడిని ఆదేశించాడు ఋత్విజుడు. యజ్ఞపశువును వెతికేందుకు అన్ని ప్రదేశాలలో వెతకసాగాడు అంబరీషుడు. కనీసం యజ్ఞం పూర్తి చేయించేందుకు ఒక మనిషైనా దొరకకపోతాడానని స్వయంగా వెతకనారంభించాడు".
"ఇలా తిరుగుతూ, ఎవరినీ బలాత్కారంగా తేవడానికి ఇష్టపడని అంబరీషుడికి ఒకనాడు, భార్యా-పిల్లలున్న ఋచీకుడనే ముని (విశ్వామిత్రుడి తోబుట్టువు భర్త) కనిపిస్తాడు. అతడికి లక్ష ఆవులిస్తానని, తన యజ్ఞాన్ని రక్షించేందుకు ఆయన కొడుకుల్లో ఒకడినిఇవ్వమని ఆయనకు నమస్కరించి, ప్రార్తించాడు. పోయిన యజ్ఞపశువుకొరకు ప్రపంచమంతా గాలించినా ఫలితం లేకపోయిందని, దానికి బదులుగా మనిషిని వుంచాల్సి వచ్చిందనీ, తన ముగ్గురి కొడుకుల్లో ఒకడిని ఇవ్వమని అంటాడు. ఆయనేమిచ్చినా తన ప్రేమకు పాత్రుడైన పెద్దకొడుకునివ్వలేనని ఋచీకుడనగానే, ఆయన భార్య, శునకుడనే తమ కనిష్ట పుత్రుడంటే తనకెంతో ఇష్టమని కాబట్టి వాడినీ అమ్మమని అంటుంది. ఆ మాటలను విన్న వారి నడిమి కొడుకు శునస్సేపుడు, తన ప్రాణమిచ్చి రాజు యజ్ఞాన్ని కాపాడుదామనుకుంటాడు. తనను తీసుకొని పొమ్మని, ఆయనిస్తానని చెప్పిన లక్ష ఆవులను తండ్రికివ్వమని శునస్సేపుడనగానే, ఆలస్యం చేయకుండా, ధర్మ ప్రీతితో తన వెంట అతడిని తీసుకునిపోయాడు అంబరీషుడు. మార్గమధ్యంలో మధ్యాహ్నమైనందున వారిరువురు ఒక పుష్కర తీరం దగ్గర కాసేపు ఆగారు".
(లోకంలో సాధారణంగా పెద్దకొడుకుపై తండ్రికి, పిన్న వాడిపై తల్లికి ప్రేముంటుంది. నడిమి కొడుకుపై తల్లితండ్రులకిద్దరికీ ప్రీతి వుండదంటారు. ఈ విషయంలో ఋషీశ్వరులు కూడా అందరివలెనే ప్రవర్తిస్తారనడానికి ఇదొక ఉదాహరణ).

                                                                                                                                                                                             రేపు తరువాయి భాగం.. 

Related Posts