సబ్బంహరి.. ఒకప్పుడు కాంగ్రెస్ నేత.. అన్నీ అనుకున్నట్టుగా జరిగి వుంటే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వుండి వుండేవారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కారణంగా రాజకీయాల్లో ఎదిగిన నేతల్లో ఆయనా ఒకరు. కాంగ్రెస్‌లో వున్నప్పుడే ఆయన వైఎస్ జగన్ తరఫున మాట్లాడారు. ఆ తర్వాత ఆయన, తెలుగుదేశం పార్టీ వైపు కాస్తంత ఆసక్తి చూపించారు. ప్రస్తుతానికైతే ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. అలాగని రాజకీయాలకు దూరమైపోలేదు. రాజకీయాల్లో వున్నా, లేనట్టు.. లేకపోయినా, వున్నట్టు వ్యవహరిస్తున్నారు సబ్బంహరి.2019 ఎన్నికల సమయానికి ఏ రాజకీయ పార్టీ వైపు ఆయన వెళతారోగానీ, ప్రస్తుతానికైతే అన్ని రాజకీయ పార్టీలతోనూ సమదూరం పాటిస్తున్నారు. అయితే, కొంచెం తెలుగుదేశం పార్టీకి ఆయన అనుకూల వాదిగా మారిన మాటవాస్తవం. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ ఆయన వైఎస్ జగన్ మీదా, పవన్‌కళ్యాణ్ మీదా, బీజేపీ మీదా విమర్శలు చేస్తూ వస్తున్నారు.విశాఖజిల్లాకు చెందిన సబ్బంహరి, పార్లమెంటుకి పోటీచేస్తారా.? అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతారా.? అన్నదానిపై జిల్లాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆయన మాత్రం, పోటీచేయడం కంటే.. ఏదో ఒక పార్టీ తరఫున 'నామినేటెడ్ పోస్ట్' దక్కించుకోవడం బెటరనే ఆలోచనలో వున్నారట. ఆ దిశగానే ఆయన తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.టీడీపీ నుంచి ఇటీవలే బంపర్ ఆఫర్ వచ్చిందట సబ్బంహరికి. చంద్రబాబు స్వయంగా తనతో మూడుసార్లు మాట్లాడారనీ, త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయనకు చెప్పాననీ అంటున్నారు సబ్బంహరి. ఈ మధ్య న్యూస్ ఛానళ్ళలో జరుగుతున్న రాజకీయ చర్చల్లో సబ్బంహరి హాట్ టాపిక్ అవుతున్నారు.'ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు.. స్పష్టంగా రాజకీయాల్ని విశ్లేషించే శక్తి నాకుంది..' అంటూ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు పడరాని పాట్లూ పడాల్సివస్తోంది. ఆయన ఎంతలా కవరింగ్ ఇచ్చుకుంటున్నా, ప్రస్తుతానికైతే టీడీపీ తరఫున పెయిడ్ ఆర్టిస్ట్‌గానే ఆయన్ని పరిగణించాలన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.